డ్రగ్స్ కేసు: నటి మిస్సింగ్? క్రిష్ ఎక్కడ?
ఈ క్రమంలో క్రిష్, లిషి గణేశ్ లను పోలీసులు విచారణ కోసం పిలిచినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాడిసన్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి
డ్రగ్స్ వ్యవహారం ఎక్కడ బయటపడినా అక్కడ సినీ ప్రముఖుల పేర్లు వినిపించడం మామూలు అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మాదక ద్రవ్యాల మాట ఎత్తితే చాలు, టాలీవుడ్ తో లింక్ ఉందేమో అనే కోణంలో ఆలోచించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లేటెస్టుగా రాడియన్ బ్లూ పబ్ డ్రగ్స్ వ్యవహారంలోనూ పలువరు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో అనూహ్యంగా స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది.
రాడిసన్ పబ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన నిందితుల వాంగ్మూలం ఆధారంగానే క్రిష్ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్ లో చేర్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ దర్శకుడికి నోటీసులు జారీ చేశారు. రాడిసన్ హోటల్ కు వెళ్లిన మాట వాస్తవమే అని అంగీకరించిన క్రిష్, పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాను ఇప్పుడు విచారణకు హాజరుకాలేనంటూ సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ రాడిసన్ హోటల్ వ్యవహారంలో క్రిష్ ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్న కారణంగా ఎంక్వైరీకి రాలేకపోతున్నానని, దీనికి రెండు రోజులు గడువు కావాలని దర్శకుడు పోలీసులను కోరారట. తప్పకుండా శుక్రవారం వ్యక్తిగతంగా తమ ముందు హాజరవుతానని సమాచారం అందించారట.
మరోవైపు రాడిసన్ హోటల్ కేసులో నిందితురాలిగా ఉన్న యూట్యూబర్ లిషి గణేశ్ మిస్సింగ్ అంటూ వార్తలు వస్తున్నాయి. నిన్నటి నుంచి నటి అందుబాటులోకి రాకపోవడంతో, ఆమె సోదరి కుషిత ఆందోళన చెందుతూ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినట్లుగా వార్తలు పేర్కొంటున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో లిషిని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించగా.. ఇప్పుడు ఆమె కనిపించడం లేదంటూ వార్తలు రావడం హాట్ టాపిక్ గా మారింది.
రెండేళ్ల క్రితం ఉగాది రోజు రాత్రి రాడిసన్ పబ్ లో డ్రగ్స్ వినియోగిస్తున్నారని సమాచారం అందడంతో, పోలీసులు సోదాలు నిర్వహించి పలువురుని అదుపులోకి తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ సమయంలో మెగా డాటర్ నిహారిక కొణిదెలతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు కూడా అదే పబ్ లో ఉండటం అప్పట్లో సంచలనంగా మారింది. మళ్లీ ఇన్నాళ్లకు డ్రగ్స్ కేసు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈసారి డైరెక్టర్ క్రిష్, నిర్మాత కేదార్ నాథ్, నటి లిషి గణేశ్ తో పాటుగా మరికొందరి పేర్లు బయటకు వచ్చాయి.
ఇప్పటికే డ్రగ్స్ సప్లయర్ సయ్యద్ అబ్బాస్ పై మాత్రం మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు మంజీరా గ్రూప్ అధినేత వివేకానంద్ ను అరెస్ట్ చేయగా, అతడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అలానే టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ తో పాటు మరికొందరికి సొంత పూచికత్తుపై స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ క్రమంలో క్రిష్, లిషి గణేశ్ లను పోలీసులు విచారణ కోసం పిలిచినట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రాడిసన్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెల్లడికానున్నాయి