అటు చిరు-ఇటు ర‌జ‌నీ.. చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారానికి సినీ హంగు!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్డీయే కూట‌మి పార్టీల ప్ర‌భుత్వానికి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మ‌ణ స్వీకారం చేస్తున్న విష‌యం తెలిసిందే.

Update: 2024-06-12 03:46 GMT

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎన్డీయే కూట‌మి పార్టీల ప్ర‌భుత్వానికి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మ‌ణ స్వీకారం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మాన్ని కూట‌మి పార్టీలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నాయి. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం శివారు ప్రాంతం కేస‌ర‌ప‌ల్లిలోని ఐటీ పార్కులో నిర్వ‌హిస్తున్న ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి అంబ‌రాన్నంటేలా ఏర్పాట్లు చేశారు. ల‌క్ష మందికిపై గా అభిమానులు వ‌స్తున్నారు. ఇక‌, సినీరంగం, రాజ‌కీయ రంగాల నుంచి కూడా పెద్ద ఎత్తున అతిర‌థ మ‌హార‌థులు వ‌స్తున్నారు. దీంతో ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మ‌మే ఓ రేంజ్‌లో సాగ‌నుందని తెలుస్తోంది.

ఇక‌, చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి సినీ హంగు కూడా అలుముకుంది. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర ప్ర‌భుత్వ అతిథిగా మెగా స్టార్ చిరంజీవి హాజ‌రు కానున్నారు. ఆయ‌న‌ను చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. దీంతో త‌న షెడ్యూల్‌లో మార్పు లు చేసుకుని చిరంజీవి ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతున్న‌ట్టు స‌మాచారం. అదేవిధంగా త‌న‌ను పిలిస్తే.. త‌ప్ప‌కుండా చంద్ర‌బాబు ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి వ‌స్తాన‌ని ప్ర‌క‌టించిన త‌మిళ సూప‌ర్ స్టార్‌.. బ‌హుభాషా న‌టుడు ర‌జ‌నీ కాంత్‌ను కూడా చంద్ర‌బాబు ఆహ్వానించారు. దీంతో ర‌జ‌నీ కూడా.. బుధ‌వారం ఉద‌యం చెన్నై నుంచి గ‌న్న‌వ‌రం చేరుకుని చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. మొత్తంగా బాబు ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో అధినేత‌లు, అగ్ర తార‌లు కూడా క్యూ క‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.

పాసుల కోసం అభిమానులు..

చంద్రబాబు ప్రమాణ స్వీకారం, అదేవిధంగా జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప్ర‌మాణం చేస్తార‌ని వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్షంగా వీక్షించేందుకు అభిమానులు పోటెత్తుతున్నారు. దీంతో పాసుల కోసం ఎగ‌బడుతున్న ప‌రిస్థితి నెల‌కొంది. పాస్ లు సరిపడా ఇవ్వలేక ముఖ్య నాయకులు త‌ల‌ప‌ట్టుకుంటున్నారు. నియోజకవర్గానికి 200 మందికి(టీడీపీ+జనసేన+బీజేపీ) మాత్రమే పాస్ లు మంజూరు చేశార‌ని తెలిసి.. అవి ఇప్ప‌టికే ఇచ్చేశార‌ని తెలిసి అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు పాసులు లేక‌పోయినా.. ప్రాంగ‌ణానికి వ‌చ్చేందుకు అభిమానులు రెడీ అయ్యారు.

దీంతో అంచ‌నాల‌కు మించి అభిమాన సందోహం భారీగా హాజరైతే ప్రమాణ స్వీకార ప్రాంగణం సరిపోయే పరిస్థితి ఉందా? లేదా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు తాము ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డ్డామ‌ని.. ఇప్పుడు టీవీలకే పరిమితమవ్వాలా? ప్రత్యక్షంగా వీక్షించే అదృష్టం లేదా? అని కొంద‌రు అభిమానులు నాయ‌కుల‌పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తమను తీసుకెళ్ళాలని నాయకులపై అభిమానుల ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో ప‌డ్డ‌ ముఖ్య నేతలు పాసులు పెంచాల‌ని పార్టీల ముఖ్య నేత‌ల‌ను కోరుకుంటున్నారు.

Tags:    

Similar News