సూపర్ స్టార్ మూవీ... ఏదో జరుగుతుంది!
ఆ మధ్య రజినీ నుంచి ఇకపై హిట్ సినిమాలు రావని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా హిట్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. ఆ మధ్య రజినీ నుంచి ఇకపై హిట్ సినిమాలు రావని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. దానికి తోడు స్టార్ దర్శకులు ఆయనతో వర్క్ కి క్యూ కట్టారు.
ప్రస్తుతం రజినీకాంత్ 171వ సినిమా కూలీ కి సంబంధించిన చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు అంటూ అధికారికంగా ప్రకటన రావడంతో పాటు పోస్టర్ ని కూడా వదిలారు.
మొదట అనుకున్న ప్రకారం రజినీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబో మూవీ 'కూలీ' ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం అవ్వలేదు. దాంతో కూలీ ఉంటుందా లేదా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేయడం, యూనిట్ సభ్యులు త్వరలో ప్రారంభం అవ్వబోతుందని మళ్లీ ప్రకటన చేయడం జరిగింది.
కూలీ సినిమాతో రజినీకాంత్ ను ఫ్యాన్స్ కోరుకునే విధంగా చూపించబోతున్నట్లుగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ గతంలో పేర్కొన్నాడు. అందుకోసం రూపొందించిన స్క్రిప్ట్ రజినీకాంత్ కి నచ్చలేదని, అందుకే మళ్లీ స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టాడని తమిళ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
స్క్రిప్ట్ లో మార్పులు, చేర్పులు చేయడం వల్లే కూలీ సినిమా షూటింగ్ పనులు ఆలస్యం అవుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అవే నిజం అయితే షూటింగ్ ప్రారంభం అవ్వడానికి మరో రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
లియో సినిమా అనుకున్న స్థాయిలో ఆడక పోవడం వల్ల లోకేష్ కనగరాజ్ ఈసారి ఛాన్స్ తీసుకునే పరిస్థితి లేదు. అందుకే స్క్రిప్ట్ ను పర్ఫెక్ట్ గా రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. కూలీ సినిమా షూటింగ్ ప్రారంభం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిణామాలు అన్ని సర్ధుకుని ఎప్పటికి సినిమా ప్రారంభం అయ్యేనో చూడాలి.