ఆధ్యాత్మిక చింతన లో సూపర్ స్టార్
ఈ సందర్భంగా యాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ మానసిక ప్రశాంతత కోసం ఏటా హిమాలయాలకు వెళ్తారు అన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి హిమాలయాల బాట పట్టారు. బుధవారమే చెన్నై బయల్దేరారు. ఉత్తరాఖండ్ మీదుగా హిమాలయాలకు చేరుకుంటారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా బద్రీనాద్- కేదార్ నాధ్ ఆలయాల్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా యాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రతిసారి తన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నానన్నారు.
ఈసారి కూడా కొత్త అనుభవాలు ఉంటాయని భావిస్తున్నానన్నారు. ప్రపంచానికి ఆధ్యాత్మక భావం అవసరమని రజనీ అభిప్రాయపడ్డారు. 'ఆధ్యాత్మికత అంటే శాంతి, ప్రశాంతత, భగవంతునిపై విశ్వాసమని' పేర్కొన్నారు. రజనీకాంత్ ఇటీవల అబుదాబీలోని బీఏపీఎస్ హిందూ మందిర్‌ను సందర్శించారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా హిమాలయ యాత్ర టూర్ ఫోటోల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతోన్న సంగతి తెలిసిందే. రోడ్డు మార్గాలు అత్యంత క్లిష్టంగా ఉన్నాయని అంటున్నారు. రజనీ సినిమాల సంగతి చూస్తే ఇటీవలే వెట్టేయాన్ షూటింగ్ పూర్తయింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలిని పట్టాలెక్కించాల్సి ఉంది. ఈ గ్యాప్ లో నే విరామం తీసుకుని యాత్రకు బయల్దేరారు. అక్కడ నుంచి తిరిగి రాగానే కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొంటారు.
అలాగే 'వెట్టేయాన్' డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. షూటింగ్ పార్ట్ బాగా వచ్చిందని రజనీకాంత్ ధీమా వ్యక్తం చేసారు. గొప్ప దర్శకుడితో పనిచేసాను అన్న అనుభూతి ఈ సినిమా అందిస్తుందని అన్నారు. అలాగే జూన్ 4 కల్లా రజనీ హిమాలయాల నుంచి తిరిగి వస్తారని సన్నిహిత వర్గాల సమాచారం. ఆరోజునే ఏపీ ఎన్నికల ఫలితాలు కూడా తేలనున్నాయి. ఈ ఫలితాల కోసం రజనీకాంత్ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.