రజనీ 'జైలర్'.. ఆ సినిమాకు కాపీ అంటున్నారే?
అయితే ఈ ప్రచార చిత్రం చూసిన కొంతమంది సినీ ప్రియులు నెటిజన్లకు ఓ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 10న ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ అయి.. సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. చాలా గ్యాప్ తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాలో రజనీ నటించారు. ప్రచార చిత్రం మొత్తం రజినీ కాంత్ ను హైలైట్ చేస్తూనే కట్ చేశారు. ఇందులో ఆయన స్టైలిష్ యాక్షన్ అదిరిపోయింది.
అయితే ఈ ప్రచార చిత్రం చూసిన కొంతమంది సినీ ప్రియులు, నెటిజన్లకు ఓ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్ర కథ కాపీ అని చెబుతున్నారు. ఓ రెండు చిత్రాలకు లింక్ చేసి చెబుతున్నారు. అదేంటంటే... సినిమాలో రజనీ ఓ రిటైర్డ్ జైలర్. తన పోలీసు కొడుకు, మనవడితో కలిసి జీవిస్తుంటారాయన. అయితే ఓ మాఫియా గ్యాంగ్ ను తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. ఈ క్రమంలోనే రజనీ.. జైలర్‌గా పనిచేసిన తన సుదీర్ఘ అనుభవంతో కొడుకును, కుటుంబాన్ని కాపాడి, మాఫియా ముఠాను మట్టు పెడతారు.
అయితే కరోనా సమయంలో నోబడి అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా కథకు, జైలర్ కు దగ్గరి పోలికలు ఉన్నాయని ట్రైలర్ చూసిన కొంతమంది నెటిజన్లు అంటున్నారు. 'నోబడి' చిత్రానికి కాపీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా విడుదలై కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ 'విక్రమ్'కు కూడా ముడిపెడుతున్నారు.
'విక్రమ్'లోనూ కమల్ హాసన్ ఒక రిటైర్డ్ ఏజెంట్. తన కొడుకు ఒక డ్రగ్ మాఫియా చేతిలో కన్నుమూస్తాడు. అదే సమయంలో మనవడి కోసమే బతుకుతున్న కమల్.. కొడుకుని చంపిన వాళ్లు ఎవరో కనుక్కొని.. వాళ్ల మీద పగ తీర్చుకుంటాడు. ఆ తర్వాత డ్రగ్ మాఫియాను అంతం చేస్తాడు. ఇప్పుడు 'జైలర్' కూడా కాస్త అటు ఇటుగా అలానే అనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. చూడాలి మరి ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో
ఇకపోతే ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా... మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఇటీవలే రిలీజైన 'వా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి' అంటూ వచ్చిన సాంగ్ సోషల్‌మీడియాలో ఫుల్ ట్రెండ్ అయింది.