జీవితంలో అతిపెద్ద తప్పు చేశానన్న రజనీకాంత్
తాజాగా ఆడియో లాంచ్ వేడుకలో రజనీ వ్యాఖ్యానిస్తూ.. తన మద్యపాన వ్యసనం పర్యవసానాల గురించి బయటపెట్టారు.
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన `జైలర్` ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆడియో లాంచ్ వేడుకలో రజనీ వ్యాఖ్యానిస్తూ.. తన మద్యపాన వ్యసనం పర్యవసానాల గురించి బయటపెట్టారు. మద్య వ్యసనాన్ని తన జీవితంలో అతి పెద్ద తప్పు అని పేర్కొన్న ఆయన ఆల్కహాల్ జోలికి వెళ్లవద్దని బాధ్యతాయుతంగా ఉంటూ అందులో ఆనందం వెతుక్కోవాలని తన అభిమానులను కోరారు.
నా జీవితంలో మద్యం లేకపోతే, నేను సమాజానికి సేవ చేసేవాడిని. మద్యపానం జీవితంలో అతిపెద్ద తప్పు! అని రజనీ పేర్కొన్నాడు. మద్యం సేవించకపోతే నేను జీవితంలో చాలా మెరుగ్గా రాణించి ఈ రోజు కంటే పెద్ద స్టార్‌గా ఎదిగి ఉండేవాడినని కూడా అన్నారు. రజనీకాంత్ తన 2018 చిత్రం `కాలా`లో మద్య వ్యసనం సమస్యను ప్రస్తావించారు. ఈ చిత్రంలో రజనీ పాత్ర తాగిన తర్వాత అతని అజాగ్రత్త కారణంగా భార్యను కోల్పోతాడు. అప్పటి వరకు ఆల్కహాల్ సిగరెట్లను స్టైల్ స్టేట్మెంట్లుగా ఉపయోగించిన రజనీ వాటిని చెడుగా చిత్రీకరించడం అదే మొదటిసారి. కాలాతోనే ఇది సాధ్యమైంది.
జైలర్ ఆడియో లాంచ్‌లో `బీస్ట్` (విజయ్ మూవీ- నెల్సన్ దర్శకుడు) పేలవమైన సమీక్షలకు వ్యతిరేకంగా `జైలర్` దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌ను సమర్థించారు. రివ్యూలు పేలవంగా ఉన్నప్పటికీ బీస్ట్ హిట్ అయిందని, డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా వల్ల ఎలాంటి నష్టం జరగలేదని రజనీకాంత్ పేర్కొన్నారు. జైలర్ రజనీకాంత్ 169వ చిత్రం. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, వసంత్ రవి, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 10న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పేరు ముందు సూపర్ స్టార్ ఎందుకు?
జైలర్ ఆడియో వేడుకలో రజనీకాంత్ తన బిరుదుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తన పేరుకు ముందు సూపర్‌స్టార్ అనే ట్యాగ్ ఉండడం తనకు ఇష్టం లేదని అన్నారు. సూపర్‌స్టార్ ను తొలగించాలని చాలామంది నిర్మాతలను కోరానని అది ఎప్పుడూ సమస్యేనని రజనీ అన్నారు. తాజాగా హుకుం పాటను రిలీజ్ చేసినప్పుడు అందులో తన పేరుకు ముందు ఉన్న `సూపర్ స్టార్` ని తొలగించాలని కోరినట్టు తెలిపారు.