లావణ్య కేసు.. రాజ్ తరుణ్ కు ఊరట
లావణ్య ఫిర్యాదు మేరకు, పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కానీ, రాజ్ తరుణ్ ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు.
టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ ప్రేయసి వివాదం రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. లావణ్య అనే యువతి రాజ్ తరుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం, మరోసారి ఈ కేసు సంచలనం కావడం వాస్తవం.
లావణ్య ఫిర్యాదు మేరకు, పోలీసులు రాజ్ తరుణ్‌పై కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కానీ, రాజ్ తరుణ్ ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో భాగంగా రూ. 20,000 పూచికత్తులతో బెయిల్ లభించింది.
మరోవైపు రాజ్ తరుణ్‌కు మద్దతుగా ముందుకొచ్చిన ఆర్జే శేఖర్ భాషా, లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. లావణ్య డ్రగ్స్‌కు అలవాటు ఉందని, ఇతరులకు కూడా డ్రగ్స్ అలవాటు చేయడమే కాకుండా, బ్లాక్ మెయిల్ చేసేదని ఆరోపించారు. అంతేకాకుండా, మస్తాన్ సాయితో ఆమెకున్న సంబంధాన్ని చాటిచెప్పే ఆడియో టేపులు కూడా బైటపెట్టారు. ఈ టేపులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, వివాదాన్ని మరింత రాజేశారు.
ఈ వివాదం ముదరుతుండగానే, లావణ్య ఒక ఛానల్ డిబేట్‌లో శేఖర్ భాషాపై చేయి చేసుకోవడం, ఆ తరువాత మరికొన్ని ఆరోపణలు చేయడం ఇరు వర్గాల మధ్య వివాదాన్ని మరింత తీవ్రమైన స్థాయికి తీసుకువెళ్లింది. శేఖర్ భాషా కూడా తనపై దాడి జరిగిందని, డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్నవారు తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ హాస్పిటల్ నుంచి ఇంటర్వ్యూలు ఇచ్చారు.
ఇంతలోనే, రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా లావణ్య వల్ల తమకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతోందని వారు పేర్కొన్నారు. రాజ్ తరుణ్ మాత్రం కోర్టు ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు. ఈ వివాదం ఇంతటితో ఆగిపోకుండా రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.