హనుమాన్ రూట్లో 'రామ్'- బ్లాక్ బస్టర్ ప్లాన్

తమ సినిమా ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించింది.

Update: 2024-01-24 12:50 GMT

సంక్రాంతి బరిలో దిగి బ్లాక్ బస్టర్ హిట్ అయింది హనుమాన్ సినిమా. అయితే ఈ మూవీ టీమ్ రిలీజ్ కు ముందు అరుదైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు అయోధ్యకు విరాళంగా ఇస్తామని ప్రకటించింది. చెప్పినట్లే కోట్ల రూపాయలను డొనేషన్ గా అందించింది. ఇప్పుడు సేమ్ రూట్ లో 'రామ్' (RAM) మూవీ టీమ్ వెళ్తోంది. తమ సినిమా ప్రతి టికెట్ మీద ఐదు రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించింది.


అయితే 'రామ్' మూవీ టీమ్ విరాళంగా ఇవ్వబోయేది అయోధ్య రామ మందిరానికి కాదు. నేషనల్ డిఫెన్స్‌ ఫండ్‌ కు ఇవ్వనుంది. అంతేకాక దేశ సైనికులకు ఈ సినిమాను అంకితం చేయనుంది. హనుమాన్ మూవీ టీమ్.. ఆధ్యాత్మికం వైపు వెళ్లగా.. రామ్ మూవీ టీమ్ దేశ సైనికులకు ఇంపార్టెన్స్ ఇచ్చింది. రక్షణ సిబ్బంది సంక్షేమం కోసం నగదు, వస్తు రూపాల్లో స్వచ్ఛందంగా ప్రజల నుంచి అందిన విరాళాల బాధ్యతను స్వీకరించేందుకు నేషనల్ డిఫెన్స్‌ ఫండ్‌ ను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.

ఇక ఈ సినిమా విషయానికొస్తే- రామ్(RAM-ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్).. దేశభక్తి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ద్వారా సూర్య అయ్యల సోమయాజుల హీరోగా పరిచయమవుతున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటించారు. హీరోతో పాటు దర్శకుడు మిహిరామ్ వైనతేయకు కూడా ఇది తొలి చిత్రమే. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా ఆయనే రాశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ తో భారీ బజ్ సంపాదించుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం జరిగింది.

ఈ సందర్భంగా నిర్మాత దీపికాంజలి మాట్లాడారు. ''మా మొదటి చిత్రమిది. మేం సినిమా నేపథ్యం నుంచి రాలేదు. బడ్జెట్ కు తగ్గట్లుగానే సినిమా తీశారు డైరెక్టర్. హీరో సూర్య చక్కగా నటించారు. ధన్యా బాలకృష్ణ ఎమోషనల్ సీన్ కంటతడి పెట్టిస్తుంది. విక్రయించిన తమ సినిమా ప్రతి టికెట్‌ మీద ఐదు రూపాయలను నేషనల్ డిఫెన్స్‌ ఫండ్‌ కు విరాళంగా ఇస్తాం. మన సైనికులకు ఈ సినిమాను అంకితం ఇస్తున్నాం'' అని నిర్మాత ప్రకటించారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడారు. ''మంచి కంటెంట్‌ ఉన్న చిత్రం రామ్. ఎన్నో ఆర్థిక కష్టాలు పడి మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నేను రషెస్ చూశా. సినిమా బాగా వచ్చింది. మొదటి సినిమాలో సాయి కుమార్ పక్కన సూర్య బాగా నటించారు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు అవుతున్నాయి. అలాగే ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

నిర్మాత బెక్కెం వేణు గోపాల్‌

"సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మన కోసం పోరాడుతున్నారు. సైనికులు, వారి త్యాగాల గురించి ఎన్నో సినిమాలు చూశాం. ఇప్పుడు రామ్ రూపంలో ఇంత మంచి సందేశాత్మక చిత్రాన్ని రూపొందించిన దర్శక, నిర్మాతలకు హ్యాట్సాఫ్. మొదటి సినిమా కావడంతో సూర్య తనను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డాడు" అని నిర్మాత బెక్కెం వేణు గోపాల్‌ చెప్పారు.

ధన్య బాలకృష్ణ

తమకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, బెక్కెం వేణుగోపాల్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు హీరో సూర్య అయ్యల సోమయాజుల. ''నేను, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ధారన్ సుక్రీ, నా ఫ్రెండ్స్... సినిమాకు మెయిన్ పిల్లర్స్. ఫ్రెండ్స్ అంతా కలిసి ఫండింగ్ చేసి సినిమా తీశాం. ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న,పెద్ద అని తేడా లేదు. పెద్ద సినిమాలకు పోటీగా వచ్చిన ఓ చిన్న మూవీ బ్లాక్ బస్టర్ అయ్యి దూసుకుపోతోంది. రామ్ అంటే భక్తి సినిమా కాదు.. దేశ భక్తి సినిమా. భవిష్యత్తులోనూ రామ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. వంద మందిలో అరవై మందికి మా సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మిహిరామ్ కు ధన్యవాదాలు. భానుచందర్, సాయి కుమార్ గారు చెప్పే డైలాగ్స్ తూటాల్లా పేలుతాయి. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది'' అని తెలిపారు. ప్రేక్షకులు తమ సినిమాకు మంచి సపోర్ట్‌ అందించాలని హీరోయిన్ ధన్య బాలకృష్ణ కోరారు.

సాయి కుమార్

''చాలా రోజుల తర్వాత ఓ మంచి దేశభక్తి సినిమాలో నటించాను. సూర్య తన మొదటి సినిమాతోనే ఇలాంటి జానర్‌ ను ఎంచుకుని సత్తా చాటారు. హీరో, దర్శకుడు మిహిరామ్ ఇద్దరూ కలిసి కృష్ణార్జునుల్లా కష్టపడి సినిమా చేశారు. ధన్యా బాలకృష్ణ కూడా బాగా నటించింది. మూవీలోని ఫైట్స్ అందరినీ ఆకట్టుకుంటాయి" అని నటుడు సాయి కుమార్ చెప్పారు.

దర్శకుడు మిహిరామ్

''నిర్మాత దీపికాంజలికి ధన్యవాదాలు. సినిమాలో నటించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇది దేశభక్తి చిత్రమే కానీ సరిహద్దులోని సైనికుల గురించి కాదు. దేశంలో అలజడి, కల్లోలం సృష్టించడానికి తీవ్రవాదులు చేసిన ప్రయత్నాలతోపాటు వాళ్లను ఎదుర్కొన్న అంతర్గత రక్షణ వ్యవస్థ హీరో కథాంశమే సినిమా. ఇప్పుడు మాకు థియేటర్లు దొరకడం చాలా కష్టం. అయితే పెద్ద సంఖ్యలో థియేటర్లు దక్కేలా ప్రయత్నిస్తున్నాం. ప్రేక్షకులు మా సినిమాను చూసి ఆదరించాలి'' అని దర్శకుడు మిహిరామ్ కోరారు.

రిపబ్లిక్ డే కానుకగా పలు చిత్రాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నప్పటికీ.. రామ్ మూవీపైనే అందరి దృష్టి పడింది. ఇప్పుడు ప్రతి టికెట్ పై రూ.5ను నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు విరాళంగా ఇస్తామంటూ ప్రకటించి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ మూవీ కూడా హనుమాన్ లానే.. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.


Tags:    

Similar News