పారిస్ ఒలింపిక్స్‌లో సింధుతో రామ్ చరణ్

ప్ర‌స్తుతం మెగా కుటుంబం పారిస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-07-28 16:35 GMT

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, పివి సింధు వంటి స్టార్‌లు సహా 117 మంది భారతీయ అథ్లెట్లు పోటీ బ‌రిలో ఉన్నారు. మ‌న అథ్లెట్ల‌ను గెలిపించాల‌న్న పంతం చాలామంది భార‌తీయుల మ‌దిలో ఉంది. కొంద‌రు సెల‌బ్రిటీలు నేరుగా ఒలింపిక్స్ వేదిక వ‌ద్ద‌కే వెళ్లి మ‌న‌వాళ్ల‌లో స్ఫూర్తి నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ప్ర‌స్తుతం మెగా కుటుంబం పారిస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒలింపిక్స్ వీక్ష‌ణ కోసం ప్ర‌త్యేకించి ఈ టూర్ ప్లాన్ చేసిన‌ట్టు మెగాస్టార్ చిరంజీవి ఇంత‌కుముందే వెల్ల‌డించారు. చిరు- సురేఖ దంప‌తులు స‌హా రామ్ చరణ్ - ఉపాసన కామినేని పారిస్‌లో ఉన్నారు. టీమ్ ఇండియాకు మద్దతు ఇస్తూ ఇంత‌కుముందే సింధుతో కలిసి ఉన్న ఓ ఫోటోను చ‌ర‌ణ్ షేర్ చేసారు. అలాగే చ‌ర‌ణ్ పెట్ డాగ్ ని లాల‌న‌గా చూస్తున్న పి.వి.సింధు వీడియో ఇంత‌కుముందే విడుద‌ల కాగా వైర‌ల్ అయింది. మెగాస్టార్ చిరంజీవి ప్యారిస్ నుండి కుటుంబ ఫోటోను రెండు రోజుల క్రిత‌మే షేర్ చేసారు.

జూలై 26న పారిస్ ఒలింపిక్స్- 2024 సంబ‌రాల్లో 16 క్రీడా విభాగాల్లో 117 మంది భారతీయ అథ్లెట్లు పోటీ పడుతున్నారు. ఈ వేడుకలకు స్టార్ల రూపంలో గ్లామర్ యాడ‌వ్వ‌డంతో మ‌న అథ్లెట్ల‌లో ఉత్సాహం నిండుతోంది. పివి సింధు త‌న తొలి మ్యాచ్ లో ప్ర‌త్య‌ర్థిని సునాయ‌సంగా మ‌ట్టి క‌రిపించి విజ‌యోత్స‌వంలో ఉన్న‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఇలాంటి స‌మ‌యంలో అథ్లెట్ల ఆనందాన్ని సెల‌బ్రిటీల‌తో షేర్ చేసుకోవ‌డం కూడా ఆస‌క్తిని క‌లిగించేదే.

భారతదేశం నుంచి అనుభవజ్ఞులైన ఒలింపియన్‌లు, మంచి కొత్త ఆటగాళ్లు ఈసారి పోటీబ‌రిలో ఉన్నారు. కీలకమైన వారిలో నీరజ్ చోప్రా తన జావెలిన్ త్రో టైటిల్‌ను కాపాడుకోవడం, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను స‌త్తా చాట‌డం అవ‌స‌రం. బ్యాడ్మింటన్‌లో పివి సింధు జోరు ఖాయంగా చూడ‌గ‌లం. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో సాధించిన ఏడు పతకాల అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించాలని భార‌త‌ బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

మ‌రోవైపు ఒలింపిక్స్ టూర్ ముగించి తిరిగి వ‌చ్చిన వెంట‌నే ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` చిత్రీకరణను పూర్తి చేస్తాడు. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ రామ్ మదన్ అనే ఐఏఎస్ అధికారిగా నటిస్తుండగా, కియారా అద్వానీ అతడి ప్రేమికురాలిగా, ఐఏఎస్ అధికారిణిగా కూడా నటించింది. మ‌రోవైపు విశ్వంభ‌ర చిత్రీక‌ర‌ణ‌ను మెగాస్టార్ పూర్తి చేయాల్సి ఉంది.

Tags:    

Similar News