వర్మ డాడీ కూడా నాగార్జున కాంపౌండ్ లో!
రాంగోపాల్ వర్మకు నాగార్జున `శివ` అనే సినిమాతో ఛాన్స్ ఇవ్వడంతోనే తానేంటో నిరూపించుకున్నారు అన్నది అందరికీ తెలిసిందే
రాంగోపాల్ వర్మకు నాగార్జున `శివ` అనే సినిమాతో ఛాన్స్ ఇవ్వడంతోనే తానేంటో నిరూపించుకున్నారు అన్నది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత వర్మ ఎదిగిన విధానం తెలిసిందే. దర్శకుడిగా అతని ఇన్నోవేటివ్ ఐడియాలజీ గొప్ప స్థానానికి తీసుకెళ్లింది. ఇండస్ట్రీకి ఎన్నో విజయాలు అందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తానో చరిత్ర రాయగలిగాడు. దీనంతటికీ కారణం నాగార్జున. ఈ విషయాన్ని వర్మ బహిరంగంగానే ఒప్పుకున్నారు.
తాను ఎన్నో పాపాలు చేసానని, ఎవరికీ మంచి చేయలేదని అన్నారు. కానీ నాగార్జున అనే మంచోడు తనకి దొరకడంతోనే ఇదంతా సాధ్యమైందని వర్మ ఓపెన్ గానే చెప్పారు. మరి అసలు వర్మ అక్కినేని కాంపౌండ్ కి ఎలా వెళ్లాడు? శివ కథ చెప్పిన తర్వాత నాగార్జున అతని ప్రతిభను గుర్తించాడు? అంతవరకూ ఒకే. అసలు కాంపౌండ్ లోకి ఎలా కాలు ఎలా పెట్టాడు? అంటే అందుకు కారణం రాంగోపాల్ వర్మ తండ్రి అని చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాన్ని ఇంతవరకూ వర్మ కావాలని దాచేసాడో? లేక మర్చిపోయి చెప్పలేదో తెలియదు గానీ తన తండ్రి అన్నపూర్ణి స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పనిచేయడంతోనే నాగార్జునకు శివ కథ చెప్పగలిగాను అని రివీల్ చేసాడు. ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఈవిషయం రివీల్ చేసారు. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే వారికి తానో వేదిక కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇందులో ప్రతిభావంతులు తమ ట్యాలెంట్ నిరూపించుకోవడానికి మంచి అవకాశంగా చెప్పుకొచ్చారు. ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నా? అవకాశం రాక అక్కడే మిగిలిపోతున్నారు. తనకు తన తండ్రి వల్ల అవకాశం వచ్చింది కాబట్టి నిరూపించుకున్నానన్నాడు? మిగతా వాళ్లకు ఆ సపోర్ట్ కూడా ఉండదు. అందుకే ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సత్తా చాటిన వారికి తన సినిమాలో పనిచేసే అవకాశం కల్పిస్తానని తెలిపారు.