వర్మ 'భూత్‌' అపార్ట్‌మెంట్‌ 20 ఏళ్లైనా పోలేదట!

రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పుడు అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. కానీ ఒకప్పుడు వర్మ హర్రర్‌ సినిమాలు తీస్తే మామూలుగా ఉండేది కాదు

Update: 2024-08-22 22:30 GMT

రామ్‌ గోపాల్‌ వర్మ ఇప్పుడు అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌.. కానీ ఒకప్పుడు వర్మ హర్రర్‌ సినిమాలు తీస్తే మామూలుగా ఉండేది కాదు. సినిమాను చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుంచి ఇంటికి పోవాలి అంటే భయపడే పరిస్థితి ఉండేది. ఊర్లలో కూడా వర్మ తీసిన సినిమాల తాలూకు సన్నివేశాలు పునరావృతం అయ్యాయి అని, ఇంకా వర్మ సినిమాల హర్రర్‌ ముచ్చట్లు ఎన్నో ప్రచారంలో ఉండేవి. వర్మ తీసిన రాత్రి సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా మాత్రమే కాకుండా వర్మ నుంచి పలు హర్రర్‌ సినిమాలు వచ్చాయి.

రాత్రి తో పాటు దెయ్యం, భూత్‌, ఫూంక్‌, ఫూంక్‌ 2 ఇలా ఎన్నో హర్రర్ సినిమాలను వర్మ రూపొందించి సక్సెస్‌ అయ్యాడు. హర్రర్‌ సినిమాలకు ఆధ్యుడు అయిన వర్మ ను హర్రర్‌ మూవీ డిమాంటి కాలనీ 2 ప్రమోషన్‌ కార్యక్రమాలకు అతిథిగా ఆహ్వానించారు. తమిళ హిట్ మూవీ డిమాంటి కాలనీ 2 ను తెలుగు లో డబ్‌ చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సినిమా తెలుగు వర్షన్‌ ప్రమోషన్‌ లో భాగంగా వర్మ ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా ఒక ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

రామ్‌ గోపాల్‌ వర్మ మాట్లాడుతూ... డిమాంటి కాలనీ సినిమా విడుదల సమయంలో టైటిల్ విషయంలో ఇబ్బందులు ఎదురైనట్లు తెలిసింది. చెన్నై లో డిమాంటి పేరుతో ఒక కాలనీ నిజంగా ఉండటం, అందుకే వారు ఆ టైటిల్ తో సినిమా వద్దు అన్నారట. సినిమా విడుదల తర్వాత ఆ కాలనీ వాళ్లు అంతా కూడా చెన్నై నుంచి బయట ప్రాంతాలకు వెళ్లి పోయారా అనేది తెలియదు అన్నారు. అయితే నేను తీసిన భూత్‌ సినిమాలో ఉన్న అపార్ట్‌మెంట్‌ మాత్రం ఇప్పటికి కూడా బహిష్కరణకు గురి అయ్యింది అన్నట్లుగా రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పుకొచ్చాడు.

భూత్‌ సినిమాను తీసిన ముంబయి అపార్ట్‌మెంట్‌ ను ఆ తర్వాత కాలంలో ఓనర్ అమ్మేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ అపార్ట్‌మెంట్‌ గురించి రకరకాల పుకార్లు ఉండటం వల్ల దాన్ని కొనేందుకు చాలా మంది ముందుకు రాలేదు అంటూ వర్మ చెప్పుకొచ్చాడు. ముంబయిలోని ఆ అపార్ట్‌మెంట్‌ అమ్ముడు పోకపోవడం ఆశ్చర్యంగా ఉందని వర్మ చెప్పుకొచ్చాడు. డిమాంటి కాలనీ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకుందని, తెలుగు వెర్షన్ కూడా తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వర్మ వ్యక్తం చేశాడు. అరుళ్‌ నిధి, ప్రియా భవానీ ముఖ్య పాత్రలో ఈ సినిమా రూపొందింది. ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది.

Tags:    

Similar News