అభిమానిని అభిమాని చంపడం.. స్టార్ ఆరాధన సిండ్రోమ్: ఆర్జీవీ

ఇప్పుడు టాలీవుడ్ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఈ హ‌త్య కేసుపై స్పందించారు. ఫార్మసీ ఉద్యోగి, ద‌ర్శ‌న్ అభిమాని అయిన‌ రేణుకా స్వామి హ‌త్య, అనంత‌రం అరెస్టుల ఫ‌ర్వాన్ని ఆర్జీవీ త‌న‌దైన శైలిలో విశ్లేషించారు.

Update: 2024-06-13 13:51 GMT

అభిమానిని అభిమాని చంపడం.. స్టార్ ఆరాధన సిండ్రోమ్ అని వివాదాస్ప‌ద ఆర్జీవీ స‌రికొత్త సూక్తిని చెప్పారు. ప్ర‌ముఖ క‌న్న‌డ హీరో ద‌ర్శ‌న్ అభిమాని హ‌త్య కేసు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఈ కేసులో నేరుగా ద‌ర్శ‌న్, అత‌డి స్నేహితురాలు ప‌విత్రకు సంబంధం ఉండ‌డంతో వారిని అరెస్టు చేయ‌డం సంచ‌న‌మైంది. ద‌ర్శ‌న్ పై క‌న్న‌డ ఆర్టిస్టులు ఎవ‌రూ అంత‌గా స్పందించ‌లేదు. ద‌ర్శ‌న్ విరోధి అయిన ర‌మ్య నంబీష‌న్ మిన‌హా ఎవ‌రూ దీనిపై కామెంట్ చేయ‌లేదు.

ఇప్పుడు టాలీవుడ్ వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఈ హ‌త్య కేసుపై స్పందించారు. ఫార్మసీ ఉద్యోగి, ద‌ర్శ‌న్ అభిమాని అయిన‌ రేణుకా స్వామి హ‌త్య, అనంత‌రం అరెస్టుల ఫ‌ర్వాన్ని ఆర్జీవీ త‌న‌దైన శైలిలో విశ్లేషించారు. దర్శన్ స్నేహితురాలైన కన్నడ నటి పవిత్రా గౌడ‌కు రేణుకా స్వామి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడని ఆరోప‌ణ‌లు రాగా...దీనిపై విచారణ ఇంకా కొనసాగుతుండగానే RGV X ఖాతాలో ఇలా వ్యాఖ్యానించారు. ''స్టార్ల‌ ఆరాధ‌కుల‌ వింత సిండ్రోమ్ ఇది'' అని ఆర్జీవీ కామెంట్ చేసారు.

''సినిమా నిర్మాత స్క్రీన్‌ప్లే ఖరారు అయిన తర్వాత మాత్రమే షూటింగ్ ప్రారంభించాలి. కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడు మేకర్స్ చాలా సార్లు రాస్తూనే ఉన్నారు.. కానీ ఈ హత్య కేసులో సినిమా ఇప్పటికే విడుదలైపోయిన‌ తర్వాత స్క్రీన్‌ప్లే రాయడం ప్రారంభించారు'' అంటూ త‌న‌దైన శైలిలో ఆర్జీవీ పంచ్ వేసారు. ''ఒక స్టార్ తన వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకున్న డై హార్డ్ అభిమానిని చంపడానికి మ‌రొక‌ డై హార్డ్ ఫ్యాన్‌ని ఉపయోగించడం స్టార్ ఆరాధన సిండ్రోమ్ లోని వింత‌కు తగిన ఉదాహరణ .. తమ ఫేవ‌రెట్ స్టార్లు తమ జీవితాలను ఎలా నడిపించాలో ఆర్డర్ చేయాలనుకునే అభిమానులు తప్పించుకోలేని స్థితి. అదే సిండ్రోమ్ ప్రభావం అంటే!''అన్నారాయన.

ఈ కేసులో బాధితురాలు రేణుక కన్నడ నటి పవిత్రా గౌడ్‌కు అసభ్యకరమైన సందేశాలు పంపేవారని వార్తలు వచ్చాయి. ఈ ప్రవర్తనతో కోపోద్రిక్తుడై అభిమానిని హత్య చేసి, మృతదేహాన్ని ద‌ర్శ‌న్ ముందే బెంగళూరులోని కామాక్షిపాళ్యం వద్ద కాలువలో పడేశారని క‌థ‌నాలొచ్చాయి. 8 జూన్ 2024న బెంగుళూరులోని సుమనహళ్లి వంతెన వద్ద బాధితుడి మృతదేహం బ‌య‌ట‌ప‌డింది. అతడిని ప్రాణాంతకంగా గాయపరిచేందుకు చెక్క దుంగను ఉపయోగించారని ... నేరస్థులు మృతదేహాన్ని వృషభావతి లోయలో పారవేయాలని భావించినా కానీ అది కుక్కలు లాక్కుని రావ‌డం వ‌ల్ల ప్లాన్ రివ‌ర్స‌యింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఎనిమిది మంది నిందితులు రేణుకాస్వామిపై దాడి జరిగిన సమయంలో ద‌ర్శ‌న్‌తో పాటు ఉన్నార‌ని పోలీసులు చెబుతున్నారు. పరోక్షంగా ప‌లువురు ఈ హ‌త్య‌లో స‌హ‌క‌రించారన్న‌ది పోలీసుల వెర్ష‌న్.

దర్శన్‌ను బెంగళూరు పోలీసులు మంగళవారం (జూన్ 11) నాడు మైసూరులో అరెస్టు చేశారు. అనంతరం బెంగళూరు తీసుకొచ్చి 6 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. రేణుకాస్వామి హత్య కేసులో ద‌ర్శ‌న్ ప్రమేయంపై పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్శన్ ఫోన్‌ను కూడా కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పవిత్రను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Tags:    

Similar News