ఇస్మార్ హీరో × బచ్చన్ డైరెక్టర్.. అయ్యే పనేనా?

ఎనర్జిటిక్ హీరోగా రామ్ పోతినేని హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు.

Update: 2024-08-21 15:30 GMT

ఎనర్జిటిక్ హీరోగా రామ్ పోతినేని హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే గత కొంత కాలంగా రామ్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు పడలేదు. చివరిగా రామ్ నుంచి వచ్చిన ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ సినిమాలు డిజాస్టర్ జాబితాలో చేరిపోయాయి. ఎన్నో హోప్స్ పెట్టుకున్న డబుల్ ఇస్మార్ట్ మూవీ అయితే రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రంగా నిలిచేలా కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే రామ్ పోతినేని ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ మూవీ ఏ జోనర్ లో ఉంటుందనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉందట. ప్రస్తుతం ఈ సినిమాలో క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో దర్శకుడు మహేష్ బాబు పి ఉన్నారు. బాలకృష్ణ కూడా ఇందులో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రామ్ పోతినేని, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై హరీష్ శంకర్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. రామ్ కి నేను చాలా స్టోరీ ఐడియాస్ వినిపించడం జరిగిందని హరీష్ శంకర్ తెలిపారు. రామ్ ఒక ఎక్స్ ప్లోజివ్ కథని ఎంచుకున్నాడని అన్నారు. త్వరలో మా ఇద్దరి కాంబినేషన్ లో సినిమాకి సంబందించిన ప్రకటన ఉంటుందని హరీష్ శంకర్ అన్నారు.

అయితే కమర్షియల్ జోనర్ లో రామ్ చేసిన మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో అతని కథల సెలక్షన్స్ పైన ఇప్పుడు చాలా మందికి సందేహాలు వస్తున్నాయి. డబుల్ ఇస్మార్ట్ మీద భారీ అంచనాలు పెట్టుకుంటే కనీసం సినిమా థీయాట్రికల్ బిజినెస్ లో 25 శాతం కలెక్షన్స్ ని కూడా వసూలు చేయలేకపోయింది. దీంతో రామ్ పోతినేని కథల ఎంపికలో మరింత జాగ్రత్త తీసుకోవాలనే మాట ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. హరీష్ శంకర్ కూడా మిస్టర్ బచ్చన్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ సొంతం చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో వెంటనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఏమైనా కమర్షియల్ సక్సెస్ అందుకుంటే అప్పుడు మరల స్టార్ హీరోలు అతనికి ఛాన్స్ లు ఇచ్చే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది. రామ్ పోతినేని కూడా ఇప్పటికిప్పుడు మరల కమర్షియల్ జోనర్ సినిమా చేయకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వరుసగా మూడు కమర్షియల్ ఫ్లాప్ లు పడిన తర్వాత మరల అదే తరహా కథలతో రిస్క్ చేసే ఛాన్స్ ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

Tags:    

Similar News