రానా హనుమాన్.. మహేష్ రాముడు?
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున రిలీజ్ చేసిన పోస్టర్ లో హనుమాన్ ని రానాతో పోలిక చూసారు.
ప్రశాంత్ వర్మ `జై హనుమాన్` ఇప్పుడు నేషనల్ లెవల్లో డిబేట్ గా మారింది. ఈ సినిమాలో భళ్లాల దేవుడు రానా హనుమాన్ గా నటించే అవకాశం ఉందని కథనాలొచ్చాయి. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం రోజున రిలీజ్ చేసిన పోస్టర్ లో హనుమాన్ ని రానాతో పోలిక చూసారు. ఇంతలోనే ఇప్పుడు ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తే ఎంత బావుంటుంది? అంటూ సోషల్ మీడియాల్లో చర్చ సాగుతోంది.
శ్రీరాముడిగా టాలీవుడ్ ఛామింగ్ హీరో మహేష్ నటిస్తే?.. ఇది నిజమైతే ఎంత బావుంటుందో! కానీ ప్రాక్టికల్ గా ఎంతవరకూ సాధ్యమవుతుందో చెప్పలేం. ప్రస్తుతం మహేష్ రాజమౌళితో సినిమా కోసం సన్నాహకాల్లో ఉన్నారు. తన బిజీలో తాను ఉంటాడు. అయితే జై హనుమాన్ లో శ్రీరాముడి పాత్ర పరిధి చాలా చిన్నది. కేవలం మూడు నాలుగు సన్నివేశాల్లో మాత్రమే కనిపించే వీలుంటుందట. అంటే అలాంటి పాత్రలో నటించేందుకు మహేష్ అంగీకరిస్తారా? అన్నది ప్రశ్నగా ఉంది.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్శ్ లో బ్లాక్ బస్టర్ మూవీ `హనుమాన్`కి సీక్వెల్ గా `జై హనుమాన్` ని ప్రకటించినప్పటి నుంచి దీనిపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటు సౌత్ తో పాటు అటు ఉత్తరాదినా హను-మ్యాన్ విజయం సాధించడంతో సీక్వెల్ పై భారీ బజ్ ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సహా దేశంలోని ప్రముఖ తారలను ఎంపిక చేసుకునేందుకు ప్రశాంత్ వర్మ సన్నాహకాల్లో ఉన్నారు. ఇప్పటికే ప్రముఖ బాలీవుడ్ స్టార్ తో టచ్ లో ఉన్నామని, జై హనుమాన్ లో అతడు కీలక పాత్రలో నటించేందుకు ఆస్కారం ఉందని ఓ మీడియా ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ తెలిపారు. అయితే ఈ సినిమాలో మహేష్ శ్రీరాముడిగా నటిస్తే బావుంటుందనేది చాలా మంది ఆశ. కానీ అది నెరవేరుతుందో లేదో తెలీదు. భవిష్యత్ లో రాజమౌళి రామాయణం తెరకెక్కిస్తే గనుక, ఈ సినిమాలో శ్రీరాముడి పాత్రను ఆఫర్ చేస్తే నటించేందుకు సిద్ధమేనా? అన్నది మహేషే చెప్పాలి.