తండ్రి సంపాదనపై తనయుడు ఆసక్తికర వ్యాఖ్యలు!
దివంగత నటుడు రంగనాధ్ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో వైవిథ్యమైన పాత్రలతో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు.
దివంగత నటుడు రంగనాధ్ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో వైవిథ్యమైన పాత్రలతో తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు రాసుకున్నారు. పాజిటివ్ పాత్రలతో పాటు నెగిటివ్ పాత్రలు పోషించి ఎలాంటి పాత్రనైనా పరకాయ ప్రవేశం చేయగల నటులుగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. సీనియర్ నటుల్లో రంగనాధ్ ది ప్రత్యేకమైన స్థానం. అయితే ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీకి వచ్చింది ఎవరూ లేరు. నటుడిగా ఆయన సేవలు ఆయనతో ముగిసాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రంగనాధ్ తనయుడు నాగేంద్ర కుమార్ ఆయన గురించి ఆసక్తిర విషయాలు పంచుకున్నారు.
ముఖ్యంగా రంగనాధ్ సంపాదన..ఆస్తు పాస్తులు వంటి విషయాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. ఆవేంటో ఆయన మాటల్లోనే..`నాన్నగారు ఎంత సంపాదించారు .. అదంతా ఏమైపోయింది? అని అడిగితే చెప్పడం కష్టం. అప్పట్లో మా ఇంట్లో 20 మందికి పైగా ఉండేవాళ్లం. ఆరోజుల్లో నాన్నకి ఒక సినిమాకి వచ్చే పారితోషికం కూడా తక్కువే. అందులోనే ఇంతమందికి సర్దుబాటు చేయవలసి ఉంటుంది. అందరి చదువులు, పెళ్లిళ్లు, పురుళ్లు ఇలా అన్ని కార్యక్రమాలు నాన్నగారి చేతుల మీదుగానే జరిగాయి.
ఉమ్మడి కుటుంబం కావడం వలన కూడబెట్టేంత మిగిలి ఉండకపోవచ్చు. నాన్నగారు తాను ఇంత సంపాది స్తున్నాననిగానీ, ఈ సినిమాకి ఇంత తీసుకున్నాననిగాని ఎప్పుడూ మాకు చెప్పలేదు. చివరి వరకూ కూడా ఆయన మాకు ఏమీ ఇవ్వలేదు. మేము కూడా ఏరోజు అడగలేదు. తన సంపాదనని ఎవరికైనా దానం చేశారా? ఎవరినైనా చదివించారా? అనేది మనకి తెలియదు. మేనేజర్ ను అడిగి తెలుసుకోవచ్చు. కానీ మా నాన్న అలా మమ్మల్ని పెంచలేదు. అందుకే ఆస్తిపాస్తుల గురించి పెద్దగా ఆరాలు తీయలేదు.
నేను పుట్టింది రాజమండ్రిలో. పెరిగింది చెన్నైలో. ప్రస్తుతం ఉంటున్నది బెంగుళూర్ లో. చిన్నప్పటి నుంచి కూడా మా నాన్న పర్సనాలిటీ . ఆయన వాయిస్ చూసి నేను భయపడేవాడిని. ఆయన చాలా సింపుల్ గా ఉండేవారు . మమ్మల్ని కూడా అలాగే పెంచారు. ఆడంబరాలు .. అట్టహాసాలు ఉండేవి కాదు. ఇంట్లో ఉంటే ఆయన కవితలు రాస్తూ కూర్చునేవారు. మా తాతగారు `మందస మహారాజు` గారి దగ్గర ఆస్థాన వైద్యుడిగా ఉండేవారు. చిన్నప్పుడు ఆయనతో పాటు మా ఫాదర్ ఆ బంగ్లాకి తరచూ వెళ్లేవారు. ఆ జమీందారీ వ్యవస్థ .. అక్కడి పద్ధతులు .. వాతావరణం అంతా చాలా దగ్గరగా చూడటం వలన, అవి ఆయనను ప్రభావితం చేశాయి. అందువలన ఆయనలో ఆ దర్పం కనిపిస్తూ ఉంటుంది` అని అన్నారు.