ఆ సినిమా బడ్జెట్‌ తగ్గించాల్సిందే!

అందుకే ఆ సినిమాకు సీక్వెల్‌ చేయాలని హీరో, దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నారు.;

Update: 2025-03-25 20:30 GMT

కోలీవుడ్‌లో విభిన్న చిత్రాల దర్శకుడిగా పా రంజిత్‌కి పేరు ఉన్న విషయం తెల్సిందే. మద్రాస్‌, కబాలీ, కాలా వంటి విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఈ దర్శకుడు గత ఏడాది తంగలాన్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం పా రంజిత్ కొత్త ప్రాజెక్ట్‌ పనిలో ఉన్నాడు. 2021లో 'సర్పట్ట పరంబారై' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సమయంలో కరోనా కారణంగా సినిమాను థియేట్రికల్‌ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేశారు. అమెజాన్ ప్రైమ్‌లో డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌ అయిన సర్పట్ట సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దర్శకుడిగా పా రంజిత్‌కి, హీరోగా ఆర్యకు మంచి పేరు తెచ్చి పెట్టిన విషయం తెల్సిందే. అందుకే ఆ సినిమాకు సీక్వెల్‌ చేయాలని హీరో, దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నారు.

అప్పట్లో సర్పట్ట సినిమాను దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా అంతకు మించి వచ్చినట్లు సమాచారం. ఇతర రైట్స్ ద్వారా మరింతగానే సినిమా దక్కించుకుంది. అందుకే పా రంజిత్‌ సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో ప్లాన్‌ చేశాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ చివరి దశకు చేరుకుంది. ఆర్య హీరోగా నటిస్తూనే సినిమాను నిర్మించాలని సిద్ధం అయ్యాడు. జీ సంస్థతో కలిసి ఆర్య ఈ సినిమాను నిర్మించేందుకు చర్చలు జరిగాయి. స్క్రిప్ట్‌ ముగింపు దశకు వచ్చేప్పటికి బడ్జెట్‌ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సీక్వెల్‌ను దర్శకుడు పా రంజిత్‌ రూ.80 కోట్లతో రూపొందించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు.

ఆర్య సినిమాకు రూ.80 కోట్ల బడ్జెట్‌ అంటే చాలా పెద్ద రిస్క్‌. పైగా పా రంజిత్‌ చాలా నమ్మకంతో దాదాపు రూ.150 కోట్లతో తీసిన తంగలాన్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద నిరాశ పరచింది. ఆ సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని తంగలాన్ మిగిల్చింది. విక్రమ్‌ వంటి స్టార్‌తోనే పా రంజిత్‌ రూ.100 కోట్ల వసూళ్లు సాధించలేక పోయాడు. కనుక ఆర్య సినిమాకు రూ.80 కోట్ల బడ్జెట్‌ అంటే చాలా ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ కారణం వల్లే ఈ సీక్వెల్‌ నిర్మాణ బాధ్యత నుంచి జీ సంస్థ తప్పకుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. జీ సంస్థ తప్పుకోవడంతో ఆర్య సొంతంగా సినిమాను నిర్మించే పరిస్థితి లేకపోవడంతో మరో కొత్త నిర్మాతను వెతుక్కునే పరిస్థితి వచ్చింది.

పా రంజిత్‌, ఆర్యలు ఇప్పటికే పలువురు నిర్మాతలతో చర్చలు జరిపారు. సర్పట్ట పరంబారై సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న మాట వాస్తవం. అయితే థియేటర్‌లో విడుదల అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అనేది తెలిసేది. ఓటీటీ స్ట్రీమింగ్‌ కావడం వల్ల సీక్వెల్‌కి థియేటర్‌లో ఎంత మేరకు స్పందన వస్తుంది అనే విషయాన్ని చెప్పలేం అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ శాతం మంది నిర్మాతలు ఆర్య హీరోగా సినిమాకు రూ.80 కోట్ల బడ్జెట్‌ పరిమితిని దాటిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కొన్నాళ్లు చూసి నిర్మాతలు ఎవరూ రాకుంటే బడ్జెట్‌ తగ్గించి రూపొందించేందుకు పా రంజిత్‌ సిద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయని తమిళ్ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. పా రంజిత్ గత చిత్ర ఫలితం, ఆర్య గత చిత్రాల మార్కెట్‌ను పరిధిలో పెట్టుకుని సర్పట్ట 2 సినిమాను రూ.50 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిస్తే సేఫ్ ప్రాజెక్ట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌ సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరి పా రంజిత్‌, ఆర్యల తుది నిర్ణయం ఏంటి అనేది చూడాలి.

Tags:    

Similar News