కాస్మో లుక్: రష్మిక మందన్న.. ది మాఫియా క్వీన్
కాస్మోపాలిటన్ కవర్ పేజీపై రష్మిక రెబల్ క్వీన్ లుక్ ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
పుష్ప2 లో రూపం, ఆహార్యానికి భిన్నమైన రూపం, ఆహార్యంతో ఇప్పుడు రష్మిక మందన్న కాస్మోపాలిటన్ కవర్ పేజీపై దర్శనమిచ్చింది. ''రష్మిక- ది రెబల్ క్వీన్... రష్మిక- ది మాఫియా క్వీన్..'' అని పోలిక చెప్పాల్సి వస్తోంది ఈ ముఖచిత్రం చూశాక. కొత్త సోఫాలో స్ట్రైకింగ్ ఫోజ్‌లతో క్వీన్ ని తలపిస్తున్న రష్మికలో రెబలిజం కూడా కనిపిస్తోంది.
యాధృచ్ఛికంగా పుష్ప చిత్రంలోను రష్మిక రెబల్ వైఫ్‌గానే కనిపించింది. పుష్పరాజ్ ని గదిలోనికి లాక్కెళ్లి రెచ్చిపోయే రసికరాణిగా, పది మందిలో భర్తను చులకన చేస్తుంటే చూడలేక చెడామడా విరుచుకుపడే ఆలిగా రష్మిక నటనను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేదు. తన అందంతోనే కాదు.. ప్రతిభతోను నేషనల్ క్రష్ అనే బిరుదుకు సరితూగుతానని నిరూపించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో కథానాయికలకు అరుదుగానే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు రష్మిక ఆ అవకాశాన్ని వందశాతం సద్వినియోగం చేసుకుని దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ పెంచుకుంది.
కాస్మోపాలిటన్ కవర్ పేజీపై రష్మిక రెబల్ క్వీన్ లుక్ ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. రష్మిక మందన్న దేశంలోని అత్యంత ప్రతిభావంతమైన, బహుముఖ నటప్రదర్శకులలో ఒకరు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లను అందుకున్నారు..అని కాస్మోపాలిటన్ ప్రశంసించింది. నవంబర్-డిసెంబర్ కవర్ స్టార్ 28ఏళ్ల రష్మిక మందన్న అంటూ మ్యాగజైన్ ప్రత్యేక కథనం ప్రచురించింది.
తాను నటి కావడం అన్నది విధి రాత అని రష్మిక మందన్న ఈ సందర్భంగా కాస్మోపాలిటన్ తో అన్నారు. నేను విధి రాతను అనుసరించే వ్యక్తిని. వాస్తవానికి జీవితంలో నేను నటిని కావాలనుకున్న దశలు ఉన్నాయి.. కానీ అది ఒక అవకాశం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ''నా జీవితంలో ఏది వచ్చినా అందులో నేను అత్యుత్తమంగా ఉండాలి'' అని అనుకున్నాను. ఈ రోజు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది విధి. ఇది చాలా ఓపికగా కష్టపడితే సాధ్యమైనది. సరిహద్దులను దాటి ప్రతిరోజూ నేర్చుకోవడం..నటిగా నా నైపుణ్యాన్ని గౌరవించుకోవడంతో వచ్చింది. కాబట్టి నేను విధిని నమ్ముతున్నాను. కోరుకున్న దాని కోసం నేను కష్టపడి పనిచేస్తాను.. అని రష్మిక వెల్లడించింది. ప్రస్తుతం రష్మిక కొత్త లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. పుష్ప 3లో రష్మిక లుక్ లో ఈ రేంజు మేకోవర్ కనిపిస్తుందేమో చూడాలి. పుష్పరాజ్ రేంజ్ మూడో భాగం(పుష్ప 3)లో మరింత పెరుగుతుంది గనుక... అక్కడ శ్రీవల్లి లుక్ కూడా మారిపోతుందేమో?