'పుష్ప 2' క్లైమాక్స్ కోసం జపాన్ వెళ్లిందా?
పుష్ప 2 బృందం ఇప్పటికే ఈ చిత్రం పతాక సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించాలని భావించిందని పుకార్ ఉంది.
నేషనల్ క్రష్ రష్మిక ఇంటర్నేషనల్ క్రష్ అవ్వాలనుకుంటోందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. పుష్పలో శ్రీవల్లిగా నటించిన రష్మిక జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. రణబీర్ యానిమల్ చిత్రంలోను అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు క్రేజీ లైనప్ తో కెరీర్ పరంగా ఉత్తమ దశలో ఉంది. తదుపరి రష్మిక నటిస్తున్న పుష్ప 2 సంచలనాలకు తెరతీయనుందని అంచనాలున్నాయి.
ఈరోజు ఆకస్మికంగా రష్మిక టోక్యో విమానాశ్రయంలో ప్రత్యక్షమవ్వడం.. అక్కడ స్థానిక అభిమానులు తనను రిసీవ్ చేసుకున్న విధానం అబ్బురపరిచింది. రష్మిక సడెన్ గా జపాన్ ఎందుకు వెళ్లింది? అంటూ రకరకాల సందేహాలు పుట్టుకొచ్చాయి. అదే క్రమంలో పుష్ప 2 క్లైమాక్స్ చిత్రీకరణ కోసం టోక్యో వెళ్లిందని ఊహాగానాలు సాగాయి. పుష్ప 2 బృందం ఇప్పటికే ఈ చిత్రం పతాక సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించాలని భావించిందని పుకార్ ఉంది. కానీ రెండవ భాగంలో కాకుండా 3వ భాగం కోసం జపాన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారని గుసగుస వినిపిస్తోంది.
నిజానికి టోక్యోలో 'క్రంచైరోల్ అనిమే' అవార్డుల్లో అతిథిగా పాల్గొనేందుకు రష్మిక జపాన్‌కు వెళ్లింది. యానిమేషన్ నేపథ్యంలో సినిమాలకు పురస్కారాలు అందించే వేదిక ఇది. ఇక భారతీయ సినిమాల్లోను జపనీ స్టైల్ యానిమేషన్ కి ప్రాముఖ్యత ఉంది గనుక .. మన దేశం నుంచి ప్రత్యేకించి రష్మికకు ఆతిథ్యం దక్కింది. రష్మిక ప్రస్తుతం ఈ అవార్డుల ఈవెంట్ కోసం మాత్రమే జపాన్‌లో ఉంది.
ముంబై హైదరాబాద్ లో రష్మికకు బలమైన ప్రచార బృందం ఉంది గనుక.. తనను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ప్రమోట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం రష్మిక కేవలం దేశీ సినిమాలతోనే సరిపెట్టుకోకుండా అంతర్జాతీయంగాను గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తోందని గుసగుస వినిపిస్తోంది.