ద‌ర్శ‌న్ కేసు: మ‌ర్మావ‌య‌వాల‌పై త‌న్న‌డంతోనే అభిమాని మృతి

కన్నడ సినీ నటుడు దర్శన్ అభిమాని హత్యోదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.

Update: 2024-06-14 03:50 GMT

కన్నడ సినీ నటుడు దర్శన్ అభిమాని హత్యోదంతానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. రేణుకాస్వామి (33)ని హత్య చేయాలని దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడ ఆదేశించారని పోలీసులు తెలిపారు. ఆ మేర‌కు ప్ర‌ముఖ క‌న్న‌డ పోర్ట‌ల్ మాతృభూమి డాట్ కాం ఒక క‌థ‌నం ప్ర‌చురించింది. ఈ క‌థ‌నం ప్రకారం.. పవిత్ర సోషల్ మీడియా పోస్ట్‌లపై ద‌ర్శ‌న్ అభిమాని రేణుకాస్వామి పదేపదే అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేసినప్పుడు ఈ విష‌యంలో జోక్యం చేసుకోవాలని పవిత్ర నేరుగా దర్శన్‌ను కోరింది. త‌న‌ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని దర్శన్‌పై ఒత్తిడి తెచ్చింది. పవిత్ర డిమాండ్ల కారణంగానే దర్శన్ హిట్‌మెన్‌లను నియమించుకుని హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామిని హత్య చేసిన కేసులో పవిత్ర గౌడను పోలీసులు మొదటి నిందితురాలిగా చేర్చారు. ఆమె డిమాండ్ మేరకే హత్య జరిగిందని గుర్తించడంతో స‌ద‌రు న‌టిని మొదటి నిందితురాలిగా చేర్చారు. నటుడు దర్శన్‌ను రెండో నిందితుడిగా చేర్చారు. వీరితో పాటు ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో 11 మందిని అరెస్టు చేశారు. ఒక మహిళ సహా మరో నలుగురిని అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం వారు పరారీలో ఉన్నారు. చిత్రదుర్గలోని ఓ ఫార్మసీలో ఉద్యోగి అయిన రేణుకాస్వామి అభిమానుల వర్గాల్లో `ఛాలెంజింగ్ స్టార్`గా పాపుల‌ర‌య్యారు. అత‌డు దర్శన్‌కి వీరాభిమాని. అయితే వివాహితుడైన దర్శన్ - పవిత్ర మధ్య వివాహేత‌ర‌ సంబంధాన్ని అతడు ఆమోదించలేదు. ఇది దర్శన్ ప్రతిష్టను దిగజార్చిందని రేణుకాస్వామి నమ్మాడు. అతడు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించాడు. ప‌విత్ర‌కు అసభ్యకరమైన సందేశాలు పంపడం.. ఆమె పోస్ట్‌లపై అసభ్యకరమైన వ్యాఖ్యలను పోస్ట్ చేయడం ప్రారంభించాడు.

పవిత్ర గౌడ ఖాతా వెనుక ఉన్న వ్యక్తిని కనుగొని అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని దర్శన్‌ని ప‌విత్ర ప‌దే ప‌దే కోరడంతో ఈ ఉపద్రవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ద‌ర్శ‌న్ నిర్ణయించుకున్నాడు. రేణుకాస్వామిని గుర్తించిన చిత్రదుర్గలోని తన అభిమాన సంఘం కన్వీనర్ రాఘవేంద్రను దర్శన్ సంప్రదించారు. చిత్రదుర్గ నుంచి రేణుకాస్వామిని కూడా రాఘవేంద్ర నేరం జ‌రిగిన స్థలానికి తీసుకొచ్చాడని ఆరోప‌ణ‌లున్నాయి. రేణుకాస్వామిని బెంగళూరులోని కామాక్షిపాళ్యలోని ఓ షెడ్‌లోకి తీసుకెళ్లి అక్క‌డ కొంద‌రు వ్యక్తులు దారుణంగా కొట్టారు. నటుడు దర్శన్ కూడా ఇక్కడికి వచ్చి బాధితుడిని బెల్టుతో తీవ్రంగా కొట్టాడు. అంతేకాదు అత‌డు కాలితో రేణుకాస్వామి మ‌ర్మాంగంపై త‌న్న‌డం వ‌ల్ల‌నే అత‌డు చ‌నిపోయాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో నిందితులు వెల్లిడించార‌న కూడా తెలుగు డెయిలీ పోర్టల్ ఈనాడు నివేదించింది. ద‌ర్శ‌న్ రేణుకాస్వామి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. దాంతో అత‌డు ఒక గోడ‌ను ఢీకొట్టాడు. ప‌డిపోయే క్ర‌మంలోనే అత‌డి మ‌ర్మాంగంపై కాలితో త‌న్న‌డం వ‌ల్ల‌నే అత‌డు మృతి చెందాడ‌ని వారు చెప్పిన‌ట్టు స‌ద‌రు క‌థ‌నం వెల్ల‌డించింది. అనంతరం ద‌ర్శ‌న్ అక్క‌డి నుంచి వెళ్లిపోవడంతో కిరాయి గూండాలు రేణుకాస్వామిని కొట్టడం కొనసాగించారు.

న‌టుడు దర్శన్ వ్యక్తిని కిడ్నాప్ చేయడం, చంపడం, అతడి మృతదేహాన్ని విడిచిపెట్టడం నుండి ప్రతి విష‌యాన్ని కిరాయి గూండాలు పోలీసుల‌కు వివ‌రాలు అందించారు. వాట్సాప్ ద్వారా సమాచారం అంతా షేర్ అయింది. హత్య జరిగిన రోజు రాత్రి కిరాయి గూండాలు దర్శన్‌ను పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించినట్లు రుజువు చేసే ఆధారాలు పోలీసులకు లభించాయని మాతృభూమి క‌థ‌నం వెల్ల‌డించింది. ఈ ముఠా హ‌త్య‌ కోసం ద‌ర్శ‌న్ నుండి రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో మరో నిందితుడు ప్రదోష్ ద్వారా డబ్బును వారికి అందజేశారు. హ‌త్య కుట్ర‌ను ప్ర‌తిపాదించిన‌ వెంటనే రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారు. ప‌ని పూర్త‌యిన‌ తర్వాత మిగిలిన మొత్తం ఇస్తామని హామీ ఇచ్చారు. వారికి న్యాయ సహాయం కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. అదే విషయంపై హామీ ఇచ్చిన తర్వాతే క‌థ అడ్డం తిరిగింది. చివ‌రికి పోలీసుల విచార‌ణ‌లో అస‌లు నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. అయితే ఆ స‌మ‌యంలో త‌న‌కు తెలిసిన పోలీస్ ఆఫీస‌ర్ కి ద‌ర్శ‌న్ ఫోన్ చేసి చెప్పాడ‌ని, అత‌డి స‌ల‌హా మేర‌కు కెనాల్ లో రేణుకాస్వామి మృత‌దేహాన్ని విసిరివేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని కూడా ఒక మీడియా క‌థ‌నం పేర్కొంది. దర్శన్ పేరును ఈ కేసులోకి లాగవద్దని గూండాల‌కు కూడా సూచించారు.

రేణుకాస్వామి మృతదేహం కామాక్షిపాళ్యంలోని మురుగు కాలువలో పడి ఉంది. ఫుడ్ డెలివరీ ఏజెంట్ కుక్కలు తినేస్తున్న మృతదేహాన్ని మొదట గుర్తించాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి అత‌డు ద‌ర్శ‌న్ అబిమాని రేణుకాస్వామి అని గుర్తించారు. దీంతో తొలుత‌ ఇద్దరు వ్యక్తులు కామాక్షిపాళ్యం పోలీసులకు లొంగిపోయి హత్య చేసినట్లు అంగీకరించారు. ఆర్థిక తగాదాలే హత్యకు కారణమని వారు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, పోలీసులు వారి వాంగ్మూలంలో తేడాలున్నాయ‌ని గుర్తించి విచారించారు. ఈ విచార‌ణ‌లో దర్శన్ స‌హా ఇతరుల పాత్ర బ‌య‌ట‌ప‌డింది. తదనంతరం మైసూర్‌లోని దర్శన్ - పవిత్రల‌ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచిన 13 మంది నిందితులను ఆరు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. బుధవారం దర్శన్, పవిత్ర, ఇతర నిందితులను సాక్ష్యాధారాల సేకరణ కోసం నేరం జరిగిన షెడ్డుకు తీసుకొచ్చారు.

ద‌ర్శ‌న్ ని ఒత్తిడి చేయాల్సింది కాదు.. పవిత్ర క‌న్నీరు మున్నీరు:

పోలీసుల విచార‌ణ‌లో తాను ద‌ర్శ‌న్ పై ఒత్తిడి తేవ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింద‌ని ప‌విత్ర క‌న్నీరు మున్నీరు అయిన‌ట్టు తెలుస్తోంది. తాను ద‌ర్శ‌న్ కి చెప్పి ఉండ‌క‌పోతే ఇలా జ‌రిగేది కాద‌ని, తానే పోలీసుల‌కు ఫిర్యాదు చేసి ఉండాల్సింద‌ని కూడా ప‌విత్ర క‌న్నీటి ప‌ర్యంతం అయిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. హ‌త్య‌కు ప్రేరేపించిన ప‌విత్ర‌ను ఏ1 గా , హ‌త్య‌కు స‌హ‌క‌రించిన ద‌ర్శ‌న్ ను ఏ2గా ప‌రిగ‌ణిస్తున్నారు. ఈ కేసులో ప‌ది మంది పైగా నిందితులను పోలీసులు విచారిస్తున్నారు.

Tags:    

Similar News