ఆ మ్యాటర్ ను అస్సలు వదిలేయవద్దు: ఆర్జీవీ

అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.

Update: 2024-10-03 08:12 GMT

అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. హీరో నాగ చైతన్య విడాకులకు కేటీఆరే కారణమని, ఆయన వల్ల చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకున్నారంటూ సురేఖ ఆరోపించడం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖులు స్పందిస్తూ ఆమెపై మండిపడుతున్నారు.

అయితే కొండా సురేఖ.. రీసెంట్ గా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బ తీయడం కాదన్నారు. సమంత కానీ, ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఇప్పుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. కొండా సురేఖ వ్యాఖ్యల వ్యవహారంపై స్పందించారు.

అసలు కొండా సురేఖ సమంతకు క్షమాపణ చెప్పడమేంటి? అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించారు. అంతకన్నా స్టుపిడిటీ తాను చూడలేదని అన్నారు. "కొండా సురేఖ సమంతను అవమానించలేదు. పొగిడారు.. నాగార్జున, నాగచైతన్య ఇద్దరూ కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యను ఆస్తి కాపాడుకోవడానికి వెళ్లమని ఫోర్స్ చేస్తే విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. దీంతో సమంతకు అవమానం కాదు.. పొగిడినట్లు.." అని ఆర్జీవీ తెలిపారు.

"ఇక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునను, నాగచైతన్యను.. అసలు ఆ టాపిక్ ఎవరూ ఎత్తడం లేదు. ఎవరూ మాట్లాడటం లేదు. అక్కినేని కుటుంబం యొక్క హుందాతనం, గౌరవం పక్కనపెట్టి చూస్తే.. ఏ ఇంట్లో అయినా ఒక మామపై, భర్తపై ఇలాంటి ఆరోపణలు నా జీవితంలో వినలేదు. ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఈ విషయాన్ని ఇలా వదిలేయవద్దని నాగార్జున, నాగచైతన్యకు రిక్వెస్ట్ చేస్తున్నా" అని తెలిపారు.

"ఇంకోసారి ఇలా జరగకుండా.. ప్రజల అందరి కోసం, ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఉండే అందరి కోసం సీరియస్ గా తీసుకుని మరచిపోలేని గుణపాఠం నేర్పాలి. మళ్లీ జరగకుండా చూడాలి. మన దగ్గర ఇది తప్పించి వేరే మార్గం లేదు" అని ఆర్జీవీ తెలిపారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ వ్యాఖ్యల విషయంలో వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటివి జరగకుండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపున అడుగుతున్నామని కోరారు.

Tags:    

Similar News