ప్రభాస్ మిస్సయినా మహేష్‌తో ఢీ తప్పదుగా
ప్రభాస్ నటించిన సినిమా విడుదలవుతోంది అంటే పాన్ ఇండియాలో థియేటర్లకు జోష్ పెరుగుతుంది
ప్రభాస్ నటించిన సినిమా విడుదలవుతోంది అంటే పాన్ ఇండియాలో థియేటర్లకు జోష్ పెరుగుతుంది. అతడు నటించిన సలార్ ఈ శుక్రవారం (డిసెంబర్ 22న) అత్యంత భారీగా విడుదలవుతోంది. నిజానికి ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కావాల్సి ఉండగా, క్వాలిటీ వర్క్ కోసం వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే క్రిస్మస్ సెలవులను ఎన్ క్యాష్ చేసుకునేందుకు సలార్ కి డిసెంబర్ 22 తేదీని లాక్ చేసారు.
అయితే భారీ క్రేజ్ ఉన్న సలార్ కోసం కొన్ని ఇతర సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇందులో విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా శైలేష్ కొలను తెరకెక్కించిన సైంధవ్ కూడా ఒకటి. అయితే ప్రభాస్ అన్న కోసం ఈ తేదీని కోల్పోవడం గర్వకారణమని దర్శకుడు శైలేష్ కొలను ప్రముఖ వెబ్ మీడియాతో అన్నారు. సలార్ లాంటి భారీ చిత్రానికి అవసరమయ్యే థియేటర్లను ఇవ్వాలని, దీనికి చాలా సంతోషంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. సైంధవ్ సంక్రాంతి బరిలో వస్తుందని కూడా తెలిపారు. సైంధవ్ తో పాటు పలు తెలుగు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నా కానీ, సలార్ విడుదల సందర్భంగా పలువురు నిర్మాతలు వేచి చూసే ధోరణిని అనుసరించారు.
సలార్ రిలీజైన తర్వాత సంక్రాంతి విడుదలలతో సందడి చాలా ఉంటుంది. అందువల్ల సంక్రాంతి బరిలో కూడా థియేటర్లు దొరకడం కష్టంగా మారుతుంది. చిన్న సినిమాల్ని అయితే సంక్రాంతి తర్వాత ఒక మంచి తేదీ చూసుకుని రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి సంక్రాంతికి అగ్ర హీరోలు నటించిన సినిమాలు పోటీపడుతున్నాయి. మహేష్ నటించిన గుంటూరు కారం, రవితేజ ఈగిల్, ప్రశాంత్ వర్మ హను-మ్యాన్, వెంకీ సైంధవ్, హరోమ్ హర అనే చిత్రాలు విడుదలవుతున్నాయి. మహేష్-వెంకటేష్-రవితేజ లాంటి పెద్ద స్టార్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొడుతున్నాయి. క్రిస్మస్ బరిలో ప్రభాస్ మిస్సయినా సంక్రాంతి బరిలో మహేష్, రవితేజ లాంటి పెద్ద హీరోలతో పోటీపడుతూ ఇప్పుడు సైంధవ్ సత్తా చాటాల్సి ఉంటుంది.