'బేబీ' దర్శకుడికి 'ఓబేబీ' విందు భోజనం..!
ఈ మధ్య కాలంలో సినిమాల టైటిల్స్ క్యాచీగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో చాలా ఆలోచించి, క్రియేటివిటీ గా పెడుతున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమాల టైటిల్స్ క్యాచీగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో చాలా ఆలోచించి, క్రియేటివిటీ గా పెడుతున్నారు. అంతకు ముందు వచ్చిన సినిమాల టైటిల్స్ కి చిన్న చిన్న తోకలు తగిలించి లేదా, ఆ టైటిల్స్ లో ఉన్న తోకలను కట్ చేసి అన్నట్లుగా టైటిల్స్ ను క్రియేటివ్ గా ఎంపిక చేస్తున్నారు.
సమంత హీరోయిన్ గా నటించిన ఓబేబీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా వచ్చిన కొన్ని సంవత్సరాలకు సాయి రాజేష్ దర్శకత్వంలో 'బేబీ' టైటిల్ తో సినిమా వచ్చింది ఓ అనే అక్షరం తొలగించి బేబీ టైటిల్ ను ఎంపిక చేయడం జరిగింది.
బేబీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. సినిమాలు హిట్ అయితే దర్శకులకు మంచి పేరు, ఆఫర్లు రావడంతో పాటు ఫ్యాన్స్ పెరుగుతారు. రోడ్డు మీద కనిపిస్తే అభిమానులు సందడి చేయడం, దగ్గరకు వచ్చి ఫోటోలు దిగడం వంటివి చేస్తారు.
దర్శకుడు సాయి రాజేష్ కూడా బేబీ సినిమా తర్వాత బాగా పాపులారిటీని సొంతం చేసుకుని రోడ్డు మీద కనిపిస్తే జనాలు వచ్చి సెల్ఫీలు దిగే స్థాయికి ఎదిగాడు అనడంలో సందేహం లేదు. తాజాగా దర్శకుడు సాయి రాజేష్ తనకు ఒక వ్యక్తి నుంచి ఎదురైన వింత అనుభవం ను చెప్పుకొచ్చాడు.
సాయి రాజేష్ స్నేహితుడు అతడి స్నేహితుడి ఇంటికి వెళ్దాం అంటూ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాడట. సరే అని ఒక ఫైన్ డే స్నేహితుడితో కలిసి ఆ వ్యక్తి ఇంటికి సాయి రాజేష్ వెళ్లాడట. సాయి రాజేష్ రాక తో ఆ వ్యక్తి ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అదితి మర్యాదలు అన్నీ చేశారు.
భోజనం చేస్తున్నంత సేపు మీ సినిమాను 50 సార్లు చూసి ఉంటాం, ఆ సినిమా చాలా బాగా తీశారు అని సినిమా గురించి గొప్పగా పొగుడుతూ ఉంటే సాయి రాజేష్ కి సంతోషం కలిగిందట. ఆ సమయంలో సదరు వ్యక్తి నుంచి సాయి రాజేష్ కి ఒక రిక్వెస్ట్ వచ్చింది. అదేంటి అంటే తన కూతురు కు సమంత అంటే విపరీతమైన అభిమానం.. ఆమెతో ఒక్క ఫోటో తీసుకునే ఏర్పాటు చేయమని విజ్ఞప్తి చేశాడు.
ఆ మాటకు సాయి రాజేష్ షాక్ అయ్యాడట. ఇంత సేపు ఆ వ్యక్తి మాట్లాడింది ఓ బేబీ సినిమా గురించి అని అర్థం అయ్యింది. భోజనం మొత్తం తిన్న తర్వాత తాపీగా అసలు విషయం చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చాం అంటూ సరదాగా సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీ వారికి ఇలాంటి అనుభవాలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి.