నీల్ అతి జాగ్రత్త కొంపముంచిందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది.

Update: 2023-12-26 11:30 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన సలార్ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజైన అన్ని సెంటర్లలో సలార్ మూవీకి సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు.

కానీ ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్లను ఎక్కువగా నిర్వహించలేదు మేకర్స్. దర్శకధీరుడు రాజమౌళితో ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటర్వ్యూ మాత్రమే తెలుగులో వచ్చింది. అది కాకుండా వేరే భాషల్లో కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు నీల్. కనీసం మ్యూజికల్ ప్రమోషన్లు కూడా సరిగ్గా చేయలేదు.

సలార్ మేకర్స్.. తాజాగా వినరా ఈ పగలు, వైరం మధ్య త్యాగంరా అంటూ సాగే పాటను విడుదల చేశారు. తెలుగు తో పాటు అన్ని భాషల్లో కూడా వినరా పాటను విడుదల చేసి సినిమాపై సాధారణ ప్రజలతోపాటు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు నెట్టింట కొత్త చర్చ మొదలైంది.

అసలు రిలీజ్ కు ముందు సినిమాలోని పాటలన్నింటనీ ప్రశాంత్ నీల్ ఎందుకు విడుదల చేయలేదని చర్చించుకుంటున్నారు. సినిమా రిలీజ్ కు కొద్ది రోజుల ముందే సూరీడే పాటను విడుదల చేశారు మేకర్స్. అది స్లోగా సాగే సాంగ్ కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ప్రతి గాథలో అంటూ సాగే పాటను మూవీ రిలీజ్ కు ఒక్క రోజు ముందు విడుదల చేశారు. ఇప్పుడు వినరా పాటను ఈ రోజు రిలీజ్ చేశారు.

దీంతో ఈ పాటలను విడుదల చేయడానికి ప్రశాంత్ నీల్ భయపడి ఉండొచ్చని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇవి చాలా నెమ్మదిగా సాగే పాటలు అని.. అందుకే రిలీజ్ చేయలేదని అంటున్నారు. ఇవి ఫేమస్ అవ్వడానికి కాస్త టైమ్ తీసుకునే పాటలని చెబుతున్నారు.

అయితే రిలీజ్ చేసిన పాటలేనా కాస్త ముందు విడుదల చేయాల్సిందని నెటిజన్లు అంటున్నారు. తగినంత టైమ్ లేకపోవడం వల్ల అవి కూడా పెద్దగా ఫేమస్ అవ్వల్లేదని కామెంట్లు చేస్తున్నారు. పాటలు ఫుల్ ఫేమస్ అయ్యంటే సినిమా వసూళ్లకు మరింత ఉపయోగపడేవని అభిప్రాయపడుతున్నారు. పాటల విషయంలో నీల్ తీసుకున్న నిర్ణయం తప్పేనని చెబుతున్నారు.

Tags:    

Similar News