స‌ల్మాన్ (X) బిష్ణోయ్: ఈగో WARకు అంతం లేదా?

నిజానికి కొన్నాళ్ల క్రితం ఆల్ ఇండియా బిష్ణోయ్ సొసైటీ అధ్యక్షుడు దేవేంద్ర బుడియా మాట్లాడుతూ 1998లో ప్రారంభమైన కృష్ణజింక కేసులో సల్మాన్ ఖాన్‌ను సమాజం క్షమిస్తుందని అన్నారు.

Update: 2024-10-14 12:12 GMT

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైని గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది. హీరోలు, సెలబ్రిటీలు, పోలీసులు అంద‌రినీ టెన్ష‌న్ పెట్టేస్తున్నాడు బిష్ణోయ్. స‌ల్మాన్ ఇంటిపై తుపాకుల‌తో కాల్పుల అనంత‌రం, స‌ల్మాన్ స్నేహితుడైన ఎన్సీపీ నాయ‌కుడి హ‌త్య తీవ్ర ఆందోళ‌న‌కు కార‌ణ‌మైంది. ఈ వార్ ని ఇలానే కొన‌సాగిస్తామ‌ని అల్టిమేటం జారీ చేసారు బిష్ణోయ్ గ్యాంగ్.

ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ అత‌డి కుటుంబం తీవ్ర ఆందోళ‌న‌లో ఉంది. చుట్టూ భ‌ద్ర‌త న‌డుమ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. బిష్ణోయ్ నెక్ట్స్ టార్గెట్ ఎవ‌రు? స‌ల్మాన్ ఖాన్ కి ఎలాంటి ముప్పు పొంచి ఉంది? అన్న ఆందోళ‌న అంద‌రిలోను ఉంది. అయితే బిష్ణోయ్ వ‌ర్సెస్ స‌ల్మాన్ గొడ‌వ‌కు ఆది అంతం లేదా? త‌మ ఆరాధ్య కుల‌ దైవం కృష్ణ జింక‌ను చంపిన స‌ల్మాన్ ని క్ష‌మించేందుకు బిష్ణోయ్ సిద్ధంగా లేడా? అంటే ఎందుకు లేడు.. దానికి ఒకే ఒక్క మార్గం ఉంది.

నిజానికి ఈ ప్ర‌పంచం మొత్తం ఈగో గొడ‌వ‌ల‌తో త‌గ‌ల‌బ‌డిపోతోంది. భార్య‌భార్త‌లు మొద‌లు గ్యాంగ్ స్ట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌తి ఇద్ద‌రి మ‌ధ్యా ఈగో గొడ‌వ‌లు పెట్రేగుతున్నాయి. అయితే ఇక్క‌డ ఒక స్టార్ కి, ఒక గ్యాంగ్ స్ట‌ర్ కి మ‌ధ్య ఈగో గొడ‌వ స‌ద్దుమ‌ణ‌గ‌క‌పోవ‌డంతో ఈ కాల్పులు బెదిరింపులు హ‌త్య‌లు ఎదుర‌వుతున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. నిజానికి కొన్నాళ్ల క్రితం ఆల్ ఇండియా బిష్ణోయ్ సొసైటీ అధ్యక్షుడు దేవేంద్ర బుడియా మాట్లాడుతూ 1998లో ప్రారంభమైన కృష్ణజింక కేసులో సల్మాన్ ఖాన్‌ను సమాజం క్షమిస్తుందని అన్నారు. లైవ్ హిందుస్థాన్ నివేదిక ప్రకారం.. ఇది ఒక షరతుపై మాత్రమే జరుగుతుందని బుడియా చెప్పారు. అప్ప‌ట్లో స‌ల్మాన్ త‌ర‌పున అత‌డి స్నేహితురాలు సోమీ అలీ క్ష‌మాప‌ణ‌లు చెప్పింది. కానీ దానిని బిష్ణోయ్ క‌మ్యూనిటీ ప‌రిగ‌ణించ‌లేదు. ''సోమీ అలీ చేసిన తప్పు కాదు, సల్మాన్ చేసిన తప్పు కాబట్టి సల్మాన్ క్షమాపణ చెప్పాలని బిష్ణోయ్ సంఘం భావిస్తుంది. అతడి తరపున ఎవరూ క్షమాపణ చెప్పలేరు. అతడు స్వయంగా ఆలయానికి వచ్చి క్షమాపణ కోరాలి. అప్పుడు మా సమాజం(సమాజం) క్షమించడం గురించి ఆలోచిస్తుంది. ఎందుకంటే మా 29 నియమాలలో ఒకటి క్షమాపణ'' అని తెలిపారు.

సల్మాన్ తాను అలాంటి తప్పు ఎప్పుడూ చేయనని, వన్యప్రాణులు, పర్యావరణాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తానని ప్రమాణం చేయాలి. అప్పుడు మేము అతనిని క్షమించే నిర్ణయాన్ని పరిశీలిస్తాము అని అత‌డు అన్నాడు. దీనిని బ‌ట్టి స‌ల్మాన్ ఈగోను వ‌దిలి దిగి వ‌చ్చి క్ష‌మాప‌ణ‌లు చెబితే చాలు. కానీ దానికి అత‌డు సిద్ధంగా లేడు. దాని ప‌ర్య‌వ‌సాన‌మే త‌న ఇంటిపై కాల్పుల ఘ‌ట‌న‌, ఇప్పుడు ఎన్సీపీ నేత హ‌త్య‌.

1998 కృష్ణజింక కేసు వివ‌రాల్లోకి వెళితే...

సూరజ్ బర్జాత్యా 1999 చిత్రం 'హమ్ సాథ్ సాథ్ హై' షూటింగ్ సమయంలో, సల్మాన్ ఖాన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపంలోని మథానియా అడవిలో కృష్ణజింకను వేటాడి చంపాడు. ఆ స‌మ‌యంలో అక్క‌డ అత‌డు టబు, సోనాలి బింద్రే, నీలంతో పాటు కనిపించాడు. వీరంద‌రిపైనా 1998లో కేసు బుక్ అయింది. సల్మాన్ ఖాన్‌కు 2018లో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. కానీ అత‌డు స్థానిక కోర్టును ఉటంకిస్తూ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు.

సల్మాన్ తరపున బిష్ణోయ్ వర్గానికి సోమీ అలీ క్షమాపణలు..

హిందుస్థాన్ టైమ్స్‌తో ఇంటరాక్షన్‌లో ఏప్రిల్ 14న ముంబై ఇంటి వెలుపల ఇటీవల కాల్పుల ఘటన జరిగిన తర్వాత సల్మాన్ ఖాన్ భద్రత గురించి సోమీ అలీ తన ఆందోళనను వ్య‌క్తం చేసింది. ''నేను ఒక క్రీడగా వేటను సమర్ధించను కానీ ఈ సంఘటన చాలా సంవత్సరాల క్రితం జరిగింది. సల్మాన్ 1998లో చాలా చిన్నవాడు. బిష్ణోయ్ తెగ అధినేతను ఆ ఘ‌ట‌న‌ను మరచిపోయి ముందుకు సాగాలని అభ్యర్థించాలనుకుంటున్నాను. అతను తప్పు చేసి ఉంటే, అతని (సల్మాన్) తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి అతన్ని క్షమించండి. సల్మాన్‌ అయినా, సగటు సామాన్యుడినైనా చంప‌డం ఆమోదయోగ్యం కాదు.. మీకు న్యాయం కావాలంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. అమెరికాలాగే భారత న్యాయ వ్యవస్థపైనా, న్యాయవాదులపైనా నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. సల్మాన్‌ఖాన్‌ను హతమార్చడం వల్ల నాకు ఎలాంటి నష్టం వాటిల్లదు అని బిష్ణోయ్‌ వర్గీయులు చెబుతున్నారు'' అని సోమీ వ్యాఖ్యానించింది.

Tags:    

Similar News