నాదెండ్ల హాట్ కామెంట్స్...టీడీపీ తట్టుకోగలదా ?

రాజకీయాల్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది ఉండదు. పరిస్థితులు అవకాశాలే ఎపుడూ పెద్ద. అలాగే వ్యూహాలే ఎపుడూ విజయాలు అందిస్తాయి.;

Update: 2025-03-11 04:09 GMT

రాజకీయాల్లో ఎవరు పెద్ద ఎవరు చిన్న అన్నది ఉండదు. పరిస్థితులు అవకాశాలే ఎపుడూ పెద్ద. అలాగే వ్యూహాలే ఎపుడూ విజయాలు అందిస్తాయి. ఆ విధంగా చూస్తే 2024లో టీడీపీ కూటమి ఏపీలో అధికారంలోకి రావడానికి కారణం ఎవరు అంటే అనేక అంశాలు దీని వెనక బలంగా పనిచేశాయి. అందులో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కూడా ఒకటి అని విశ్లేషణలు ఉన్నాయి.

అదే సమయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అండదండలు కూడా అతి ముఖ్యంగా సహకరించాయి. అలాగే యాభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన దిగ్గజ నేత చంద్రబాబు చాణక్య రాజకీయం కూడా చాలా బలంగా పనిచేసింది. ఇలా ప్రతీ అంశమూ కూడా కూటమి విజయం వెనక ఉంది.

అయితే క్రెడిట్ ని ఎవరు తీసుకోవాలీ అంటే సమిష్టిగానే అని చెప్పాలి. ఇక్కడే ఎవరి వాదనలు వారికి ఉంటాయనిపిస్తుంది. జనసేన విషయం తీసుకుంటే ఆ పార్టీ అధినేత పవన్ కి విపరీతమైన గ్లామర్ ఉంది. ఆయన వెనక బలమైన సామాజిక వర్గం ఉంది. యువత మహిళాలలో విశేషంగా క్రేజ్ ఉంది.

దాంతో పవన్ ఫ్యాక్టర్ బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్పాలి. ఇక కూటమి కట్టాలని 2022 నుంచే పవన్ చెబుతూ వచ్చారు. ఆ విషయంలో ఆయన తుదివరకూ పట్టుదల పట్టారు. తనకు కేటాయించిన 24 ఎమ్మెల్యే సీట్లను 21కి కుదిరించున్నారు. అలాగే అనకాపల్లి ఎంపీ టికెట్ తన సొంత అన్నకు ఇచ్చినా కూడా వెనక్కి తీసుకుని బీజేపీకి వచ్చేలా చూశారు.

ఇలా పవన్ ఫ్యాక్టర్ ఈ ఎన్నికల్లో విజయానికి ఎంతో ఉపయోగపడింది అని చెప్పాలి. అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ దాకా బలంగా ఉంది. ఎంత గ్లామర్ ఉన్నా మరెంత పట్టుదల ఉన్నా పార్టీ కూడా పటిష్టంగా ఉంటేనే సాధ్యపడతాయి. అందువల్ల చూసుకుంటే టీడీపీ ఏపీలో అత్యంత బలమైన పార్టీ. సుశిక్షితులైన పార్టీ క్యాడర్ బలంగా ఉంది.

అంతే కాదు అంకితభావంతో పనిచేసే క్యాడర్ టీడీపీ సొంతం. ఇక పొత్తులు ఎత్తుల విషయంలో బాగా పండిపోయిన చంద్రబాబు చాకచక్యం కూడా ఎంతగానో ఉపకరించింది అని చెప్పాలి. ఆశావహులు ఎంతో మంది ఉన్నా అందరినీ కూర్చోబెట్టి బుజ్జగించి దారికి తెచ్చుకోవడంలో బాబుకే క్రెడిట్ ఇవ్వాలి. అలాగే కేంద్రం సాయం అందించినా దానికి ఎపుడు ఎక్కడెక్కడా వాడాలి అన్ని పూర్తిగా తెలిసిన వారుగా బాబుని చూడాలి

ఈ విధంగా అందరూ కలసిన మీదటనే కూటమి ఘన విజయం సాధించింది అని చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో పిఠాపురం పీటముడి పడి టీడీపీ జనసేనల మధ్య సంబంధాలను కొంచెం ఇబ్బంది పెడుతోంది. తాను చంద్రబాబు మాట మీద పనిచేశాను త్యాగం చేశాను తనకు తగిన పదవి దక్కలేదని వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పిఠాపురం టీడీపీ నేతలు అంతా వర్మకు పదవి దక్కకపోవడం అంతా జనసేన స్కెచ్ అని ఆడిపోసుకుంటున్నారు.

ఈ క్రమంలో పిఠాపురంలోని ఈ రాజకీయ మంటలు కాస్తా ఏకంగా ఏపీలో చంద్రబాబు దాకా వెళ్తున్నాయి. జనసేనలో నంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్ అయితే పార్టీ క్యాడర్ మీటింగులో మాట్లాడుతూ పవన్ లేకపోతే కూటమికి అధికారం లేదు, చంద్రబాబు సీఎం కూడా అయింది పవన్ పట్టుదల వల్లనే అని హాట్ కామెంట్స్ చేశారు. పవన్ ఎంతో తగ్గి వ్యవహరించారని అందరినీ కలుపుకున్నారని, పొత్తుల విషయంలో ఎంతో ఆలోచించారని నాదెండ్ల చెప్పారు.

ఇదంతా దేనికి అంటే ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం జనసేన మీద లోకల్ టీడీపీ నేతలు విమర్శలు చేస్తూండడంతో జనసేన నేతలు కూడా మేము లేకపోతే మీ అధినేతకే అధికారం ఎక్కడిది అన్నంతగా ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇది కాస్తా చిలికి చిలికి పెను వివాదంగా మారుతోంది. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే పవన్ వల్లనే పవర్ అని సీఎం కుర్చీ బాబుకు దక్కిందని జనసేన నేతలు బాహాటంగా అనడాన్ని టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎంతవరకూ జీర్ణించుకుంటారు అన్నది కూడా చర్చగా ఉంది. పై స్థాయిలో అయితే లోలోపల బాధపడతారు కానీ దిగువ స్థాయిలో ఇది మరింతగా కాక పుట్టించే అంశం అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News