ట్రెండీ టాక్: సల్మాన్ 'బబ్బర్ షేర్'
చాలా సంవత్సరాలుగా ఈ జోడీ నుంచి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఏక్ థా టైగర్ - భజరంగి భాయిజాన్ వంటి బ్లాక్‌బస్టర్‌లను అందించిన సల్మాన్ ఖాన్ -కబీర్ ఖాన్ మరోసారి కలిసి పని చేయనున్నారు. చాలా సంవత్సరాలుగా ఈ జోడీ నుంచి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు మరో సినిమా కోసం ప్రయత్నాలు స్పీడప్ చేసారని తెలిసింది.
ఈసారి కబీర్ ఖాన్ తన హృదయానికి దగ్గరగా ఉన్న స్క్రిప్ట్‌ను సల్మాన్ ఖాన్‌కి అందించినట్లు సోర్సెస్ ధృవీకరిస్తున్నాయి. ఇందులో సల్మాన్ పాత్ర పేరు `బబ్బర్ షేర్`. ఈ పాత్రను సల్మాన్ తప్ప మరెవరూ చేయలేరని కబీర్ భావిస్తున్నాడు. సల్మాన్ తన మొదటి ఎంపికగా కబీర్ గట్టిగా నమ్ముతున్నాడు అని తెలిసింది. కబీర్ ఇప్పటికే సల్మాన్‌ను రెండు సార్లు కలిశాడు. ఈ నెలలో మరిన్ని సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నారు. సల్మాన్ కూడా ఈ స్క్రిప్టు విషయంలో ఉత్సాహంగా ఉన్నాడు. దీనికి `బబ్బర్ షేర్` అని పేరు పెట్టారు. సల్మాన్ ఈ చిత్రం చేయడానికి అంగీకరిస్తే ఇది ఏక్ థా టైగర్, బజరంగీ భాయిజాన్, ట్యూబ్‌లైట్ తర్వాత సల్మాన్ కబీర్‌ల 4వ కలయిక అవుతుంది.
ఒక స్టోరి లైన్ సిద్ధమయ్యాక.. ప్రాథమిక ఆలోచన గురించి చర్చించడానికి సల్మాన్ - కబీర్ నవంబరు & డిసెంబర్ నెలల్లో ఒకసారి కలుసుకున్నారు. జనవరి చివరి నాటికి పూర్తి స్క్రిప్ట్‌తో తిరిగి వస్తానని కబీర్ సల్మాన్‌కి హామీ ఇచ్చాడు. తదుపరి 45 రోజులలో సల్మాన్ , కబీర్ ఇద్దరూ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. అయితే సల్మాన్ - కబీర్ కచ్ఛితంగా అపజయం లేని సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు. దానివల్ల స్క్రిప్టు దశలోనే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని తెలిసింది.
టైగర్ 3 తో నిరాశ:
టైగర్ ఫ్రాంఛైజీలో మొదటి చిత్రం ఏక్ థా టైగర్ కి కబీర్ ఖాన్ దర్శకుడు. ఆ తర్వాత అబ్బాస్ అలీ తెరకెక్కించిన టైగర్ 2 (టైగర్ జిందా హై) బంపర్ హిట్ కొట్టింది. కానీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయడంలో టైగర్ 3 విఫలమైంది. టైగర్ 3 సల్మాన్ కెరీర్ బెస్ట్ అవుతుందని భావిస్తే, అది యావరేజ్ గా ఆడింది. కలెక్షన్ల పరంగా భారీ ఓపెనింగులు వచ్చినా కానీ టైగర్ 3 ఫేట్ వేరుగా ఉంది. అంతిమంగా ఈ చిత్రం పరాజయంగా మిగిలింది.