సల్మాన్ 10 ఈద్ విజయాలను మించి 'బాహుబలి-2'!
సల్మాన్ ఖాన్ ఈద్ విడుదలలు బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల మైలురాయిని ఆవిష్కరించాయి. కిక్ - సుల్తాన్ సహా 11 సినిమాలు ఈద్ కి విడుదలయ్యాయి
సల్మాన్ ఖాన్ ఈద్ విడుదలలు బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల మైలురాయిని ఆవిష్కరించాయి. కిక్ - సుల్తాన్ సహా 11 సినిమాలు ఈద్ కి విడుదలయ్యాయి. వీటన్నిటి వసూళ్లు ఈ ల్యాండ్ మార్క్ ని చేరుకున్నాయి. కానీ ఈ సినిమాలన్నిటినీ ఒకే ఒక్క `బాహుబలి 2` కొట్టేసింది. ప్రభాస్ నటించిన బాహుబలి 2 భారతదేశంలో అప్పటికి ఉన్న అన్ని రికార్డులను బద్ధలు కొట్టింది. దాదాపు 2200 కోట్ల వసూళ్లతో దేశంలోనే నంబర్- 1 వసూళ్ల చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పటికీ దేశీ కలెక్షన్లలో ఈ సినిమానే నంబర్ -1. పఠాన్ దీనిని అధిగమించిందని కథనాలొచ్చాయి.
ఈ సంవత్సరం `ఈద్` సందర్భంగా బడే మియాన్ చోటే మియాన్ - మైదాన్ అనే రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ లాంటి పెద్ద స్టార్లు నటించిన సినిమాలివి. కానీ దురదృష్టవశాత్తు ప్రీ-రిలీజ్ హైప్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు! విమర్శకులు , ట్రేడ్ విశ్లేషకులు సహా సినీ ప్రేక్షకులు ప్రస్తుత ఈద్ సీజన్‌లో సల్మాన్ ఖాన్ ని మిస్సవుతున్నామని కలత చెందారు. భాయ్ జాన్ సినిమా వచ్చి ఉంటే బావుండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సల్మాన్ నటించిన 11 సినిమాలు ఈద్ కి విడుదలై ఏకంగా 2000 కోట్ల మైలురాయి వసూళ్లను అందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సల్మాన్ భాయ్ `వాంటెడ్` ఈద్ కి రిలీజై ఘనవిజయం సాధించింది. 2009 ఈద్‌కి ఈ చిత్రం విడుదలైంది. ఆ తర్వాత ఏకంగా 11 సినిమాలు ఈద్ కి రిలీజై ఘనవిజయం సాధించాయి. అయితే ఖాన్ గత కొన్నేళ్లుగా తన బ్లాక్ బస్టర్ మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించలేకపోయాడు. రేస్ 3, ట్యూబ్‌లైట్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ ఈద్ కానుకగా వచ్చినా కానీ, అవన్నీ బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఆడాయి.
సల్మాన్ ఖాన్ నటించిన ఈద్ రిలీజ్‌లలో భారత్ (2019) వరకు చూస్తే వీటన్నిటి కలెక్షన్లు 1902.11 కోట్లుగా ఉన్నాయి. `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్` భారీ ఫ్లాప్ గా నిలిచినా కానీ, భాయ్ ని 2000 కోట్ల క్లబ్‌లో చేర్చింది. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ బ్లాక్‌బస్టర్ ట్యాగ్‌ని పొందలేకపోయినా కానీ 110 కోట్ల జీవితకాల కలెక్షన్లు సాధించింది. దీనితో సల్మాన్ ఖాన్ `ఈద్` విడుదలలు మొత్తం 2012 కోట్లు తెచ్చాయి. ఇది అరుదైన రికార్డ్.
భాయిజాన్ తన కెరీర్‌లో `ఈద్` సందర్భంగా మొత్తం 11 చిత్రాలను అందించాడు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
వాంటెడ్ (2009) - 64 కోట్లు
దబాంగ్ (2010) - 143 కోట్లు
బాడీగార్డ్ (2011) - 142 కోట్లు
ఏక్ థా టైగర్ (2012) - 198 కోట్లు
కిక్ (2014) - 233 కోట్లు
బజరంగీ భాయిజాన్ (2015) - 320.34 కోట్లు
సుల్తాన్ (2016) - 300.45 కోట్లు
ట్యూబ్‌లైట్ (2017) - 121.25 కోట్లు
రేస్ 3 (2018) - 169 కోట్లు
భారత్ (2019) - 211.07 కోట్లు
కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (2023) - 110 కోట్లు
ఈ జాబితాలో బజరంగీ భాయిజాన్ అత్యధిక వసూళ్లతో ఆధిపత్యం చెలాయించింది. దీనికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు ను అందించారు. ఆసక్తికరంగా ఇదే రైటర్ నుంచి వచ్చిన బాహుబలి 2 ఏకంగా 2200 కోట్లు వసూలు చేసింది. సల్మాన్ భాయ్ నటించిన 11 ఈద్ రిలీజ్‌ల వసూళ్లను ఒకే ఒక్క బాహుబలి 2 అధిగమించింది. ఒక తెలుగు సినిమా అంతకుమించి అని నిరూపించింది. ప్రభాస్ స్టార్ డమ్ ని స్కైలో నిలబెట్టిన ఫ్రాంఛైజీ బాహుబలి.