న్యాయం జ‌ర‌గాల‌ని సమంత‌ డిమాండ్ !

మిహిర్ సూసైడ్ పైన తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత స్పందించింది.

Update: 2025-02-01 09:40 GMT

కేర‌ళ‌లో ర్యాగింగ్ వ‌ల్ల ఓ స్కూల్ స్టూడెంట్ మిహిర్ సూసైడ్ చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో మిహిర్ త‌ల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్టులో త‌మ కొడుకుని ఎలా ర్యాగింగ్ చేశారో వివ‌రించారు. ఆ రిపోర్డు చ‌దివిన ఎవ‌రికైనా గుండె బ‌రువెక్క‌డం ఖాయం. పిల్ల‌లు స్కూల్ లో చేసే ప‌నులివా అనే ఆలోచ‌న త‌ప్ప‌క వ‌స్తుంది. మిహిర్ సూసైడ్ పైన తాజాగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత స్పందించింది.


మిహిర్ సూసైడ్ న్యూస్ త‌న‌ని క‌లిచివేసింద‌ని, మ‌నం 2025లో ఉన్నా స్వార్థం, ద్వేష‌పూరిత‌మైన తోటి విద్యార్థుల వ‌ల్ల మిహిర్ లాంటి మంచి స్టూడెంట్ ను పోగొట్టుకున్నామ‌ని, ర్యాగింగ్ ఎంతటి దారుణానికి ఒడిగ‌డుతుందో ఈ ఘ‌ట‌న ద్వారా అర్థ‌మ‌వుతుంద‌ని, ర్యాగింగ్ వ‌ల్ల మ‌నిషి శారీర‌కంగా, మానసికంగా కుంగిపోతున్నాడ‌ని స‌మంత తెలిపింది.

స‌మాజంలో మ‌న‌కెన్నో యాంటీ ర్యాగింగ్ చ‌ట్టాలున్న‌ప్ప‌టికీ ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను మ‌నం ఆప‌లేక‌పోతున్నామంటే మ‌న‌మెలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలి. మిహిర్ లాంటి కొంత‌మంది బ‌య‌ట‌కు చెప్పుకోలేక ఇలా లోలోప‌ల కుమిలిపోతూ చివ‌ర‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారని స‌మంత అంటోంది.

ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో కేవ‌లం సంతాపం తెలిపి చేతులు దులుపుకోకూడ‌ద‌ని, చ‌నిపోయిన మిహిర్ కు న్యాయం జ‌ర‌గాల‌ని డిమాండ్ చేయాల‌ని, అధికారులు దీనిపై త‌గిని చ‌ర్య‌లు తీసుకుని న్యాయం జ‌రిగేలా చేసి ఆ త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా ఉండాల‌ని ఆశిస్తున్నాని స‌మంత త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

అంతేకాదు, ఇక‌పై విద్యార్థులెవ‌రైనా స‌రే ఎక్కడైనా ఇలాంటి వేధింపులు జ‌రిగిన‌ట్టు తెలిస్తే నోరు విప్పి ధైర్యంగా వాటిని ఎదుర్కోమ‌ని, త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు జాలి, ద‌య‌, ప్రేమ లాంటి వాటిని నేర్పించాల‌ని స‌మంత తెలిపింది. స‌మంత‌తో పాటూ కీర్తి సురేష్ కూడా ఈ విష‌యంలో స్పందించింది. స్టూడెంట్ ఆత్మహ‌త్య విన్నాక చాలా బాధేసింద‌ని, ఆ బాలుడికి న్యాయం జ‌ర‌గాల‌ని డిమాండ్ చేసింది.

Tags:    

Similar News