ఫోటో స్టోరి: ఫిట్‌నెస్‌తోనే ఆనందం అందం
అందాల కథానాయిక సమంత రూత్ ప్రభు ఇంతకుముందు మయోసైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడిన సంగతి తెలిసిందే.
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేనిదే ఏదీ లేదు. ఎంత ధనికులు అయినా అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు కోరుకునేది కేవలం తాను ఆరోగ్యంగా ఉంటే చాలు అని...! నేటి ఆధునిక ఒత్తిళ్ల జీవితంలో ప్రజలకు లేనిదే అది. దీనికి సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేదు. అందాల కథానాయిక సమంత రూత్ ప్రభు ఇంతకుముందు మయోసైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో పోరాడి విజేతగా నిలిచింది సామ్. అయితే తన విజయంలో శారీరక శ్రమ, ఫిటెనెస్ నియమాలు ప్రధాన భూమిక పోషించాయి. యోగా, జిమ్, డ్యాన్సింగ్ సెషన్స్ తో పూర్తిగా సమంత మానసిక, శారీరక ఆరోగ్యాలను సంపాదించుకుంది. అన్ని కలతల నుంచి బయటపడటానికి ఫిట్ నెస్ రొటీన్ ఉపకరించింది.
ఇక సమంత ఫిట్‌నెస్ శిక్షణ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన శారీరక వ్యాయామాలను ఎంచుకుంటోంది. ఇప్పుడు పోల్ డ్యాన్స్ తో ఫిట్ నెస్ సూత్రాన్ని అనుసరించడం ఆసక్తిని కలిగిస్తోంది. తాను కోలుకునే ప్రయాణంలో భాగంగా వివిధ రకాల శారీరక శ్రమలను అన్వేషిస్తోంది.
దీనికోసం రకరకాల వ్యాయామాలు, డ్యాన్సుల్లో శిక్షణ పొందుతోంది. తాజాగా సమంత షేర్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ లో ముంబైలో ప్రముఖ పోల్ డ్యాన్స్ శిక్షకురాలు జోన్ మిచెల్‌తో డ్యాన్స్ సెషన్ తర్వాత సమంత సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసారు. ఈ అనుభవం అద్భుతం అంటూ తన పోల్ డ్యాన్స్ అనుభవం గురించి వెల్లడించారు. శరీరాన్ని నిరంతరం ఉత్తేజితంగా ఉంచడం ద్వారా అన్నిరకాల రుగ్మతలకు చెక్ పెట్టవచ్చనే ప్రాథమిక సూత్రాన్ని తూ.చ తప్పక అనుసరస్తోంది సామ్. తను ఇప్పుడు పూర్తిగా ఫిట్ గా ఉంది. నటిగా కెరీర్ పరంగా స్పీడ్ పెంచేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉంది.
ప్రస్తుత కెరీర్ విషయానికి వస్తే... సమంత తదుపరి `బంగారం` చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాతో నిర్మాతగాను సామ్ ఆరంగేట్రం చేస్తుంది. వరుణ్ ధావన్‌తో కలిసి `సిటాడెల్: హనీ బన్నీ`లో నటించింది. రాజ్ అండ్ DK దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఈ సంవత్సరం OTTలో ప్రీమియర్ అవుతుంది.