షారుక్‌ ఖాన్, ఉదయనిధి.. ఇద్దరికి ఎంత తేడా?

ఇప్పుడు దేశంలో రెండు సంఘటనలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా ఇవి సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ గా మారాయి

Update: 2023-09-05 07:54 GMT

ఇప్పుడు దేశంలో రెండు సంఘటనలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా ఇవి సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ గా మారాయి. ఇద్దరు హీరోలు తమ చర్యల ద్వారా దేశవ్యాప్తంగా ఒకేసారి పాపులర్‌ అయ్యారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరు రియల్‌ హీరోగా నిలవగా, ఇంకొకరు రియల్‌ విలన్‌ గా నిలిచారని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

సనాతన ధర్మం... కరోనా, డెంగ్యూ, మలేరియా వంటిదని దాన్ని నియంత్రించడం కాదు నిర్మూలించాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు, డీఎంకే ప్రభుత్వంలో మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు, హిందూ సంఘాలతోపాటు తృణమూల్‌ కాంగ్రెస్, కాంగ్రెస్‌ పార్టీ వంటివి ఖండించాయి.

ఒక వ్యక్తిగా ఉండి ఉదయనిధి తన అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు కానీ.. ఒక మంత్రిగా ఉండి ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ఆయన ఒక మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ ఉదయనిధి క్రిస్టియన్‌ అని అంటున్నారు. ఒక చర్చిలో ఒక పాస్టర్‌ పాదాలు మొక్కుతూ ఉదయనిధి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫొటో వైరల్‌ అవుతోంది.

ఈ దేశంలో వివిధ రకాల మతాలవాళ్లు దేవాలయాలను, చర్చిలను, మసీదులను కూడా సందర్శిస్తుంటారు. అలాంటిది ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రముఖ సినీ నటుడిగా ఉన్న ఉదయనిధి అన్ని మతాల పట్ల తటస్థంగా ఉండటమో లేక అన్నింటిని సమానంగా చూడటమో కాకుండా హిందువులను కించపరిచేలా మాట్లాడటం ఏమిటంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇక బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌.. షారుఖ్‌ ఖాన్‌ తాజా చిత్రం.. జవాన్‌. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముస్లిం మతస్తుడు అయిన షారుఖ్‌... జమ్మూలోని ప్రముఖ దేవాలయం శ్రీ వైష్ణో దేవి ఆలయాన్ని సందర్శించాడు. అంతేకాకుండా తాజాగా ఆయన తిరుమలకు వచ్చి శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తన కుటుంబంతోపాటు దర్శించుకుని తన భక్తిప్రపత్తులను చాటారు. తద్వారా హిందూ దేవుళ్లపై తనకు విశ్వాసం ఉందని చాటాడు. తన కుటుంబానికి సైతం ఆయన ఇదే సందేశాన్ని ఇచ్చాడు. తద్వారా అందరి మనసులను గెలుచుకున్నాడు.

కానీ ఇందుకు భిన్నంగా ఉదయనిధి స్టాలిన్‌.. ఎన్నికల్లో హిందువుల ఓట్లతో కూడా గెలిచి వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడంపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. షారుఖ్‌ ఖాన్‌ తన చర్యలతో రియల్‌ హీరోగా నిలవగా.. ఉదయనిధి రియల్‌ విలన్‌ గా నిలిచారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News