సంక్రాంతికి వ‌స్తున్నాం.. గేమ్‌ను మార్చ‌బోతోందా?

ఒక‌ప్పుడు తెలుగు సినిమాల శాటిలైట్ రైట్స్ మంచి రేటు ప‌లికేవి. టీవీల్లో కొత్త సినిమాలు రిలీజైతే ప్రేక్ష‌కుల నుంచి కూడా రెస్పాన్స్ బాగుండేది.

Update: 2025-02-11 05:04 GMT

ఒక‌ప్పుడు తెలుగు సినిమాల శాటిలైట్ రైట్స్ మంచి రేటు ప‌లికేవి. టీవీల్లో కొత్త సినిమాలు రిలీజైతే ప్రేక్ష‌కుల నుంచి కూడా రెస్పాన్స్ బాగుండేది. 25, అంత‌కుమించి కూడా టీఆర్పీ వ‌చ్చేది. కానీ ఇప్పుడు శాటిలైట్ ధ‌ర‌లు బాగా ప‌డిపోయాయి. ఎంత క్రేజున్న సినిమా వ‌చ్చినా టీఆర్పీ 10 రావ‌డం కూడా గ‌గనంగా మారిపోయింది. ఇదంతా ఓటీటీల పుణ్య‌మే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. సినిమా రిలీజైన నెల రోజుల్లోనే (కొన్ని చిత్రాల‌కు ఇంకా ముందే) ఓటీటీల్లోకి వ‌స్తుండ‌డంతో.. టీవీ ఛానెళ్ల‌లో అదే చిత్రం వ‌చ్చే స‌మ‌యానికి స్పంద‌న అంతంత‌మాత్రంగానే ఉంటోంది.

ఓటీటీలో బాగా రేట్లు పెంచి ఇవ్వ‌డంతో వాటి వైపు మొగ్గు చూపుతూ శాటిలైట్ హ‌క్కుల గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశారు. అవి రాను రాను నామ‌మాత్రంగా మారాయి. రెండు వైపుల నుంచి ఆస‌క్తి త‌గ్గిపోయింది. కానీ ఒక‌ప్పుడు నిర్మాత‌లు కోరుకున్న, అంత‌కంటే ఎక్కువ రేట్లే ఇచ్చిన ఓటీటీలు ఇప్పుడు రూటు మార్చేశాయి. గీచి గీచి బేర‌మాడుతున్నాయి. అన్ని సినిమాల‌నూ కొన‌డం లేదు కూడా. దీంతో డిజిట‌ల్ మార్కెట్ ఒక్క‌సారిగా ఢ‌మాల్ అయిన ప‌రిస్థితి.

ఆకాశం వైపు మ‌బ్బులు చూసి ముంత‌లో నీళ్లు ఒల‌క‌బోసుకున్న చందాన డిజిట‌ల్ మార్కెట్ మీద దృష్టిపెట్టి శాటిలైట్‌ను దెబ్బ తీసుకున్న నిర్మాత‌లు ఇప్పుడు మ‌ళ్లీ వెన‌క్కి చూస్తున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి. శాటిలైట్ మార్కెట్‌ను పెంచుకునే క్ర‌మంలో ఓటీటీల కంటే ముందు టీవీ ఛానెళ్ల‌లో సినిమాను ప్ర‌ద‌ర్శించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇందులో భాగంగానే అగ్ర నిర్మాత దిల్ రాజు త‌న లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ సంక్రాంతికి వ‌స్తున్నాం చిత్రాన్ని ఓటీటీ కంటే ముందు టీవీ ఛానెల్లో ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు.

ఇందుకోసం జీ తెలుగుతో ఒప్పందం కుదిరింది. ఓటీటీ కంటే ముందు టీవీ ఛానెల్లో ప్ర‌సారం అంటూ ప్ర‌చారం కూడా మొద‌లుపెట్టారు. ఇంకా డేట్ అయితే ఇవ్వ‌లేదు. ఈ ఐడియా వ‌ర్క‌వుట్ అయితే.. మ‌రిన్ని సినిమాలు ఈ బాట ప‌ట్టే అవ‌కాశ‌ముంది. దీని వ‌ల్ల ఓటీటీలు దారిలోకి వ‌స్తాయ‌ని.. తామే పెంచి, కిందికి ప‌డేసిన మార్కెట్‌ను మ‌ళ్లీ కొంచెం పైకి లేపే ప్ర‌య‌త్నం చేస్తాయ‌ని.. కంటెంట్ కోసం ఆ సంస్థ‌లే నిర్మాత‌ల‌ను అడిగే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని టాలీవుడ్ ఆశిస్తోంది.

Tags:    

Similar News