ఆ స్టార్ హీరోపై బెదిరింపులకు పాల్పడింది ఇతడే!
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ని చంపేస్తామంటూ ఇటీవల ఓ బెదిరింపు ఫోన్ కాల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ని చంపేస్తామంటూ ఇటీవల ఓ బెదిరింపు ఫోన్ కాల్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 50 లక్షలు ఇవ్వకపోతే తాము చెప్పింది చేస్తామని హెచ్చరించారు. దీంతో మరోసారి బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అంతకు ముందు సల్మాన్ ఖాన్ కి బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతలోనే షారుక్ కూడా ఊహించని బెదిరింపు ఎదుర్కోవడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఈ బెదిరింపు విషయంలో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా ఆ నిందితుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అతడు రాయపూర్ కి చెందిన పైజన్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఫోన్ కాల్ ఆధారంగా విచారణ మొదలు పెట్టిన పోలీసులు చత్తీస్ ఘడ్ లోని రాయ్ పూర్ కి చెందిన పైజన్ ఖాన్ అనే వ్యక్తి పేరు మీద నంబర్ రిజిస్టర్ అయినట్లు గుర్తించారు.
మంగళవారం చత్తీస్ ఘడ్ వెళ్లిన పోలీసులు అక్కడ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు విచారణకు సిద్దమవుతున్నారు. అతడి విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి? అన్నది తెలియాలి. ఈ బెదిరిం పుకు బిష్ణోయ్ గ్యాంగ్ కు ఎదైనా సంబంధం ఉందా? అన్న అనుమానాలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలాంటి బెదిరింపులు షారుక్ ఖాన్ కు కొత్తేం కాదు. సరిగ్గా ఏడాది క్రితం అక్టోబర్ లోనే హత్యా బెదిరింపులు వెళ్లాయి.
సరిగ్గా మళ్లీ అదే నెలలో షారుక్ ఖాన్ పై మళ్లీ బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. గత ఏడాది బెదిరింపు కాల్ కు ..తాజా బెదిరింపుకు ఏదైనా సంబంధం ఉందా? అనే లింక్ ను సైతం వెతికే పనిలో ఇప్పటికే పోలీసులు నిమగ్నమయ్యారు.