బిష్ణోయ్ పేరు చెప్పి బెదిరించాడు.. జూ.ఆర్టిస్టుకి స్టార్ హీరో లోకువ‌?

స‌ల్మాన్ స్నేహితుడు రాజ‌కీయ నాయ‌కుడు బాబా సిద్ధిఖ్ హ‌త్య‌కు ముందే స‌ల్మాన్ ని లేపేయాల‌ని ప్లాన్ చేసామ‌ని బిష్ణోయ్ గ్యాంగ్ చెప్ప‌డంతో పోలీసులు నిర్ఘాంత‌పోయారు.

Update: 2024-12-06 23:30 GMT

స‌ల్మాన్ ఖాన్ వ‌ర్సెస్ గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ వార్ గురించి తెలిసిందే. కృష్ణ జింక‌ను వేటాడినందుకు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క‌పోతే హ‌త‌మారుస్తామ‌ని ప‌దే ప‌దే లారెన్స్ బిష్ణోయ్ వార్నింగులు ఇచ్చాడు. ప‌లుమార్లు స‌ల్మాన్ పై ఎటాక్ ల‌కు ప్లాన్ చేసాడు. బిష్ణోయ్ సోద‌రుల అనుచ‌రుల‌ దాడులు చూసి బిత్త‌ర‌పోయిన ముంబై పోలీసులు స‌ల్మాన్ కి వై కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌డ‌మే గాక నిరంత‌రం అత‌డి ఇంటి చుట్టూ ప‌హారా కాస్తున్నారు. స‌ల్మాన్ స్నేహితుడు రాజ‌కీయ నాయ‌కుడు బాబా సిద్ధిఖ్ హ‌త్య‌కు ముందే స‌ల్మాన్ ని లేపేయాల‌ని ప్లాన్ చేసామ‌ని బిష్ణోయ్ గ్యాంగ్ చెప్ప‌డంతో పోలీసులు నిర్ఘాంత‌పోయారు.

ఇదిలా ఉండ‌గానే ఇటీవల ముంబైలోని దాదర్‌లోని షూటింగ్ లొకేష‌న్ లోనే నేరుగా స‌ల్మాన్ ని గ్యాంగ్ స్ట‌ర్ బిష్ణోయ్ పేరుతో బెదిరించాడు ఒక జూనియ‌ర్ ఆర్టిస్ట్. షూటింగ్ లొకేషన్‌లో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి సల్మాన్ ఖాన్‌కు తీవ్రమైన ముప్పుగా మారాడు. 4 డిసెంబర్ 2024న ఈ సంఘటన జరిగింది. గుర్తుతెలియని వ్యక్తి సెట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించ‌డ‌మే గాక‌.. నేను బిష్ణోయ్‌ని పిలవనా? అని అడిగాడు. అక్క‌డ‌ సిబ్బందిని బెదిరించాడు.

దీంతో సికంద‌ర్ సెట్ లో భ‌ద్ర‌త‌పై అనుమానాలు త‌లెత్తాయి. బెదిరించిన వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్ర‌స్తుతం విచారిస్తున్నారు. ఈ ఘ‌ట‌న త‌ర్వాత‌ ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఈ కేసులో అదుపులోకి తీసుకున్న సభ్యులు కాని జూనియర్ ఆర్టిస్టులపై విచారణ జరిపించాలని ఇండియా సినీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. స‌ల్మాన్ ని బెదిరించిన‌ జూనియర్ ఆర్టిస్టుకు రిజిస్టర్డ్ జూనియర్ ఆర్టిస్టుల సంఘంతో సంబంధం లేదని, బయటి వ్యక్తి అని కూడా వారు స్పష్టం చేశారు. సంఘం అధ్యక్షుడు బిఎన్ తివారీ మాట్లాడుతూ, ``ఆ వ్యక్తి ఏ అసోసియేషన్‌కు చెందినవాడు కాదు. అతడు జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్నట్లు రికార్డులు లేవు. బిష్ణోయ్ పేరుతో సల్మాన్ ఖాన్ బౌన్సర్‌లను ఎవరు బెదిరించారు? సల్మాన్ ఖాన్ షూటింగ్ కోసం ఆర్టిస్టుల‌ను తీసుకునే ముందు మేకర్స్ సరైన విచారణ చేయకపోవడం చాలా పెద్ద ప్రమాదం ఉంది. FWICE సంఘటనపై సమగ్ర విచారణను కోరుతోంది. మా రికార్డుల్లో ఉన్న ఆర్టిస్టుల‌ను మాత్ర‌మే షూటింగ్ కోసం తీసుకోవాలి`` అని కోరారు.

సల్మాన్ వ‌ర్సెస్ బిష్ణోయ్ వార్ అంత‌కంత‌కు ముదురుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో స‌ల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరిగాయి. అదే ముఠా ఈ సంఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. ఈ వివాదం 1998లో రాజస్థాన్ పర్యటనలో కృష్ణజింకలను వేటాడిన స‌ల్మాన్ కి కంటిపై కునుకు ప‌ట్ట‌నీకుండా చేస్తోంది. బిష్ణోయ్ కమ్యూనిటీ కృష్ణ జింక‌ను పవిత్రమైనవిగా పరిగణిస్తున్నందున ఖాన్ నుండి బహిరంగ క్షమాపణ చెప్పాలని బిష్ణోయ్ డిమాండ్ చేస్తున్నారు. కానీ స‌ల్మాన్ అన‌వ‌స‌రంగా క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌ర‌ని అత‌డి తండ్రి స‌లీమ్ ఖాన్ ఇంత‌కుముందు ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News