సీఎం రేవంత్ రెడ్డికి సిద్ధార్థ్ కౌంటర్?
ఇక్కడి ఆడియన్స్ కోసం హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్లు చేసినా లాభం లేకుండా పోయింది.
కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ కు టాలీవుడ్ లో కూడా స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగు సినిమాలు చేయడం తగ్గించినా ఫాలోయింగ్ మాత్రం అలానే ఉంది. రీసెంట్ గా డబ్బింగ్ మూవీస్ టక్కర్, చిన్నా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. ఇక్కడి ఆడియన్స్ కోసం హైదరాబాద్ వచ్చి మరీ ప్రమోషన్లు చేసినా లాభం లేకుండా పోయింది.
త్వరలో లోకనాయకుడు కమల్ హాసన్ ఇండియన్-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సిద్ధార్థ్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో కీలక పాత్ర పోషించారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్ జోడీగా మూవీలో కనిపించనున్నారట. అయితే సిద్ధార్థ్.. మీడియా ముందు ఎప్పుడూ ఓపెన్ గా మాట్లాడుతారు. ముక్కుసూటిగా సమాధానాలిస్తుంటారు. రీసెంట్ గా భారతీయుడు-2 ప్రెస్ మీట్ లో కూడా అలానే మాట్లాడారు.
"తెలంగాణలో సినిమా టికెట్ రేట్ హైక్ కాావాలంటే.. ఆ సినిమాలో నటిస్తున్న వారు సోషల్ అవేర్నెస్ కోసం వీడియోలు చేసి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే నటులకు సామాజిక బాధ్యత ఉందా?" అని ఓ జర్నలిస్ట్ అడిగారు. దీంతో సిద్ధార్థ్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ సీఎం కూడా అలా అనలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
"నా పేరు సిద్ధార్థ్ అండీ. 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. టాలీవుడ్ సినిమాల్లో ప్లీజ్ యూజ్ కండోమ్ అని విల్ బోర్డ్స్ లో నా ఫేస్ వచ్చినట్లు గవర్నమెంట్ తో కోపరేట్ చేశాను. 2005-2011 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సేఫ్ సె*క్స్ అని ఎక్కడ హోర్డింగ్ ఉంటే.. అక్కడ సిద్ధార్థ్ చేతిలో కండోమ్ ఉంటుంది. ఆ బాధ్యత నా బాధ్యత. ఒకరు చెబితే నాకు రాదు. ఒక యాక్టర్ కు బాధ్యత ఉందా అంటే.. నో కామెంట్స్. అసలు ఆ ప్రశ్నకు అర్థం లేదు" అని అన్నారు.
"సాధారణంగా ప్రతి ఒక్క నటుడికి సామాజిక బాధ్యత ఉంటుంది. మనస్సాక్షి ఆధారంగా పనులు చేస్తాం. సీఎం రిక్వెస్ట్ చేస్తే కచ్చితంగా చేస్తాం. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా.. మీరు ఇలా చేస్తే మేము అలా చేస్తామని చెప్పలేదు. కమల్ సర్, రకుల్ మీరు ఆ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇవ్వక్కర్లేదు" అంటూ సిద్ధార్థ్ ముగించారు. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరి ఆలోచన వారికే కరెక్ట్ లా అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.