సంక్రాంతి బరిలో ఏలియన్

యాంకర్‌ నుంచి హీరో స్థాయికి ఎదిగిన కోలీవుడ్ యాక్టర్​ శివ కార్తికేయన్​.

Update: 2023-09-24 11:08 GMT

యాంకర్‌ నుంచి హీరో స్థాయికి ఎదిగిన కోలీవుడ్ యాక్టర్​ శివ కార్తికేయన్​. 'రెమో' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఆ తర్వాత 'వరుణ్​ డాక్టర్‌', 'డాన్' వంటి చిత్రాలతో తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే రీసెంట్​గా ప్రిన్స్​, మావీరన్​ చిత్రాలతో వరుస పరాజయాలను అందుకున్న ఆయన నుంచి రాబోతున్న కొత్త చిత్రం 'అయలాన్‌'.

వాస్తవానికి ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల మందుకు రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దిగాలని ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని నిర్మాత కోటపాడి జె. రాజేష్ తెలిపారు. వచ్చే సంక్రాంతికి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

"మేం ఎంతో ప్రేమతో, మనసుపెట్టి చేసిన సినిమా ఇది. ఈ ప్రయాణంలో మాకు కొన్ని కష్టాలు ఎదురయ్యాయి. అయినా ధైర్యాన్ని అస్సలు కోల్పోలేదు. పట్టుదలతో సినిమాను చేశాం. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడాలని అనుకోలేదు. అందుకే రిలీజ్ కాస్త ఆలస్యం అయింది. ప్రేక్షకులకు అంచనాలకు మించి సినిమా ఉంటుంది" అని పేర్కొన్నారు.

అంటే ఈ చిత్రం అనుకున్నట్టే సంక్రాంతికి రిలీజైతే.. తెలుగులో గుంటూరు కారం, ఈగల్​, నా సామీ రంగ, హనుమాన్​, విజయ్​ దేవరకొండ చిత్రాలతో పోటీ పడాల్సి వస్తుంది. పాన్ ఇండియా లెవల్​లో అయితే భారీ వీఎఫ్​ఎక్స్​తో తెరకెక్తుతున్న హనుమాన్​తో పోటీ పడాల్సి ఉంటుంది. ఇక కోలీవుడ్​ నుంచి సూర్య భారీ ప్రాజెక్ట్ కంగువా జనవరిలో వస్తుందని అప్పట్లో ప్రచారం సాగింది. కానీ దీనిపై క్లారిటీ లేదు.

కాగా, సైన్స్‌ ఫిక్షన్‌కు కామెడీని జోడించి 'అయలాన్‌' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్‌ రవి కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్​. కెజెఆర్ స్టూడియోస్, 24ఎఎం స్టూడియోస్ బ్యానర్లపై కోటపాడి జె. రాజేష్, ఆర్.డి. రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 'అయలాన్' అంటే 'ఏలియన్' అని అర్థం. ఓ ఏలియన్ ప్రధాన పాత్రలో సౌత్ ఇండస్ట్రీలో సినిమా రావడం ఇదే మొదటిది. ఈ చిత్రంలో 4500లకు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయట.

Tags:    

Similar News