ట్రోలింగ్స్ కు చెక్.. మంచు విష్ణు మరో షాకింగ్ డిసిషన్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మంచు విష్ణు రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మంచు విష్ణు రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.. గత కొంతకాలంగా మంచు విష్ణు తన పాన్ ఇండియా మూవీ కన్నప్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఓ యుట్యూబర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి కూతుళ్ళ రిలేషన్ పై అశ్లీలంగా మాట్లాడారని సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆ యుట్యూబర్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
ఈ ఘటన తర్వాత మంచు విష్ణు ఓ వీడియో రిలీజ్ చేశారు. యుట్యూబ్ లో నటీనటులపై ట్రోలింగ్స్ చేస్తోన్న వారు తక్షణమే ఆ కంటెంట్ ని తొలగించాలని వార్నింగ్ ఇచ్చాడు. 24 గంటల్లో కించపరిచే విధంగా చేసిన మీమ్స్, ట్రోలింగ్ వీడియోలని తొలగించకపోతే చాలా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచు విష్ణు హెచ్చరికలపై యుట్యూబ్ లో డార్క్ కామెడీ పేరుతో ట్రోలింగ్ కంటెంట్ చేసే వారు రియాక్ట్ కాలేదు. దీంతో ఓ ఐదు యుట్యూబ్ ఛానల్స్ మీద కంప్లైంట్ చేసి బ్యాన్ చేయించినట్లు మంచు విష్ణు గతంలో తెలిపారు.
ఇదిలా ఉంటే తాజాగా ట్రోలింగ్ వీడియోలు చేస్తోన్న యుట్యూబర్స్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున మా ప్రతినిధులు రఘుబాబు, శివబాలాజీ, రాజీవ్ కనకాల డీజీపీని కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు అందించారు. సెలబ్రెటీల జీవితాలలోకి ప్రవేశించి వ్యక్తిత్వ హననం చేస్తూ మీమ్స్, ట్రోలింగ్ కంటెంట్ చేస్తోన్న యుట్యూబర్స్ మీద యాక్షన్ తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసు శాఖ పాజిటివ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది.
సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసుని టేకప్ చేసి మా ప్రతినిధులు కంప్లైంట్ ఇచ్చిన యుట్యూబర్స్ పై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. యుట్యూబర్స్ మీమ్స్ మాటున క్రియేట్ చేస్తోన్న కంటెంట్ తో వ్యక్తిగత జీవితాలలోకి వెళ్లిపోతున్నారని, అశ్లీలం, అసభ్యపదజాలంతో దారుణంగా వీడియోలు చేస్తున్నారని మా ప్రతినిధులు ప్రెస్ మీట్ లో పెట్టారు. ట్రోలింగ్ కంటెంట్ క్రియేట్ చేసేవారి విషయంలో మా అసోసియేషన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధం అవుతుందని రాజీవ్ కనకాల తెలిపారు.
సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాలలోకి వెళ్లిపోవడం, కుటుంబ సభ్యులని కూడా కించపరిచే విధంగా కంటెంట్ క్రియేట్ చేసేవారందరూ తక్షణం వీడియోలు తొలగించాలని రాజీవ్ కనకాల కోరారు. ఇప్పటికే డీజీపీకి దీనిపై ఫిర్యాదు చేయడం జరిగిందని, చట్టపరంగా కఠిన చర్యలు మున్ముందు ఉంటాయని హెచ్చరించారు.