రామ లక్ష్మణులపై అనుచిత వ్యాఖ్యలు.. సారీ చెప్పిన శ్రీముఖి..!
భారతీయ పురాణాలు ఇతిహాసాలను కించ పరిచేలా కామెంట్స్ చేసిన శ్రీముఖి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
'బిగ్ బాస్ తెలుగు' ఫేమ్, యాంకర్ కమ్ యాక్టర్ శ్రీముఖి గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరకు అందాలు అద్దిన యాంకర్స్ లో ఈ బ్యూటీ ముందు వరుసలో ఉంటుంది. ఓవైపు టీవీ ప్రోగ్రామ్స్ కి హోస్టుగా చేస్తూనే, మరోవైపు సినిమా ఈవెంట్స్ లో యాంకర్ గా సందడి చేస్తోంది. అవకాశం వచ్చినప్పుడు సినిమాల్లోనూ నటిస్తోంది. అయితే శ్రీముఖి ఇప్పుడు అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకుంది. రామ లక్ష్మణులు ఫిక్షనల్ క్యారక్టర్స్ అంటూ సినీ ఈవెంట్ లో ఆమె చేసిన కామెంట్లు పెద్ద దుమారం రేపుతున్నాయి.
విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న సినిమా ''సంక్రాంతికి వస్తున్నాం''. ఇటీవల నిజామాబాద్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. దీనికి శ్రీముఖి యాంకరింగ్ చేసింది. అక్కడికి వచ్చిన అభిమానులను ఉత్సాహపరుస్తూ, తన మాటలతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే వేదిక మీద నిర్మాతలకు ఎలివేషన్ ఇచ్చే క్రమంలో నోరు జారింది. దిల్ రాజు - శిరీష్ లను రామ లక్ష్మణులతో పోలుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కైంది శ్రీముఖి.
"రామ్ లక్ష్మణ్ అనేవి ఫిక్షనల్ క్యారక్టర్స్ అని మనం అప్పట్లోనే విన్నాం. కానీ సాక్షాత్తూ రామలక్ష్మణులు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే, ఇంకొకరు శిరీష్" అని శ్రీముఖి కీలక వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా ఎవరైనా అన్నదమ్ముల బంధం గురించి మాట్లాడాల్సి వస్తే, రామ లక్ష్మణులను ప్రస్తావిస్తారు. ఇప్పుడు శ్రీముఖి కూడా అదే చేసింది కానీ.. కాకపోతే అవి కల్పిత పాత్రలు అంటూ స్టేట్మెంట్ పాస్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
శ్రీముఖి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిందంటూ నెట్టింట ఫైర్ అవుతున్నారు. హిందూ ఫ్యామిలీలో పుట్టి, మైథాలజీ మీద ఏమాత్రం అవగాహన లేకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎలా చేసిందంటూ విరుచుకు పడుతున్నారు. భారతీయ పురాణాలు ఇతిహాసాలను కించ పరిచేలా కామెంట్స్ చేసిన శ్రీముఖి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు కోరుతూ శ్రీముఖి తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసింది.
"రీసెంట్ టైమ్స్ లో నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామ లక్ష్మణులను ఫిక్షనల్ అనడం జరిగింది. నేనూ ఒక హిందువునే. నేనూ ఒక దైవ భక్తురాలినే. అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడూ జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ.. అందరికీ క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి అందరూ పెద్ద మనసుతో నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్" అని శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో మాట్లాడింది.