నిండు విగ్రహం.. నిత్య నూతనం.. దటీజ్ ఎన్టీఆర్!!
ఇది నిజం కూడా. తెలుగు కళామతల్లి ముద్దుల బిడ్డ అనడంలో సందేహమే లేదు.
కొందరు చరిత్రలో కలుస్తారు. మరికొందరు చరిత్రగా మారతారు. ఎక్కడో ఒకరిద్దరు నెల్సన్ మండేలా, అబ్దుల్ కలాం వంటివారు .. చరిత్రకు కొత్త పాఠాలు జోడిస్తారు. అలాంటి వారిలో ఒకరు తెలుగు లోగిళ్ల మనసెరిగిన అన్నగారు.. తెలుగు వారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు. ``ఎక్కడో నిమ్మకూరులో పుట్టాం. తెలుగు కళామతల్లి పోషణలో పెరిగాం. తెలుగు వారికి రుణ పడిపోయాం`` అంటూ.. జస్టిస్ చౌదరి విజయోత్సవ సభలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ఆయన అభిమానుల చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఇది నిజం కూడా. తెలుగు కళామతల్లి ముద్దుల బిడ్డ అనడంలో సందేహమే లేదు.
తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ భాషలలో కలిపి దాదాపు 303 చిత్రాలలో అన్నగారు నటించారు. పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించి ఘన విజయం దక్కించుకున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆయన దర్శకత్వం వహించిన `సీతారామ కల్యాణం` సినిమా ఇప్పటికీ.. అంతర్జాతీయ ఫిల్మి ఇనిస్టిట్యూట్స్‌లో దర్శకత్వం, స్క్రీన్‌ప్లే విభాగాల్లో పాఠ్యాంశంగా ఉండడం. ఇలా.. అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించారు అన్నగారు. రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా, ఆరాధ్య దైవంగా నిలచిపోయారు.
నేడు(మంగళవారం) అన్నగారు ఎన్టీఆర్ 101వ జయంతి. వందేళ్ల తర్వాత కూడా.. ఒక నటుడు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు గుర్తుంచుకోవడం.. చరిత్రలో ఇదే ప్రథమం అంటే అతిశయోక్తి కాదు. జాతీయ స్థాయి నేతలకు ఉన్న ఆదరణ అన్నగారు సొంతం చేసుకున్నారు. రాజకీయాల్లో నేషనల్ ఫ్రెంట్‌ను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారు. ఆ దశలోనే ఆయనకు ప్రదాని అయ్యే భాగ్యం కలిగినా.. తెలుగు నేలపై మమకారంతో తృణప్రాయంగా వదులుకున్నారు. తెలుగు వాడు పీవీ నరసింహారావు.. ప్రధాని అవుతున్నారంటే.. పండగ చేసుకున్న తెలుగు నాయకుడు కూడా ఆయనే. అందుకే.. నంద్యాలలో పీవీ పోటీ చేసినప్పుడు తాను ప్రత్యర్థిగా.. మారబోనని స్పష్టం చేసి.. ఏకపక్ష విజయం అందించిన రాజకీయ సమున్నతుడు కూడా ఎన్టీఆరే!!
1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు అన్నగారు. ఆ తరువాత మూడు దఫాలుగా 7 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా రికార్డు సొంతం చేసుకున్నారు. పేదల నేతగా.. రూ.2 కే కిలో బియ్యం అందించారు. మహిళలకు ఆస్తి హక్కు అందించారు. అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. కరణం వ్యవస్థను, భరణం(కట్నం) వ్యవస్థను కూడా రద్దు చేయించారు.
తొలి పేరు కృష్ణ!
చాలా మందికి అన్నగారి తొలి పేరు తెలియదు. ఆయన అసలు పేరు.. నందమూరి కృష్ణ. 1వ తరగతి లో చేర్చినప్పటి వరకు ఇదే పేరు ఉంది. అయితే.. ఆయన మేనమామ.. పేరుమార్పు సూచించాక.. `తారక రాముడు`గా మారింది. సినీ రంగంలోకి వచ్చాక దుక్కిపాటి మధుసూదనరావు.. ఈ పేరును తారక రామారావుగా మార్చారు. ఇలా.. మూడు సార్లు అన్నగారి పేరు మారింది. కాగా. 1923, మే 28న సాయంత్రం 4 గంటల 32 నిమిషాల సమయంలో కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు కారణ జన్ముడైన ఎన్టీఆర్ జన్మించారు. ఈ పేరు చిరస్థాయి. ఈ భూమి.. ఈ నేల.. ఈ నీరు ఉన్నంత వరకు.. అన్నగారు అందరి వాడు!!