శ్రద్ధ 'స్త్రీ 2' మూవీ ఎలా ఉంది?
'సాహో' లాంటి భారీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్ధా కపూర్.
'సాహో' లాంటి భారీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది శ్రద్ధా కపూర్. ఈ బ్యూటీ రాజ్ కుమార్ రావు లాంటి ట్యాలెంటెడ్ నటుడితో కలిసి 'స్త్రీ 2'లో నటిస్తోంది అనగానే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటి భాగం 'స్త్రీ' బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ పైనా భారీ అంచనాలేర్పడ్డాయి. చందేరి నగరంలో సర్కత (మొండెం లేని తల) అరాచకాలను ఆపేందుకు తిరిగి వచ్చే స్త్రీ (మిస్టీరియస్ లేడీ)గా శ్రద్ధా ఈ చిత్రంలో నటించింది. అయితే స్త్రీతో విక్కీ (రాజ్ కుమార్ రావు) కనెక్షన్ ఏమిటన్నది తెరపైనే చూడాలి. సర్కత- స్త్రీ మధ్య విక్కీ అతడి గ్యాంగ్ వ్యవహార శైలి ఏవిధంగా నవ్వించింది? అన్నది థియేటర్లలోనే చూడాలి.
పబ్లిక్ టాక్ ప్రకారం...స్త్రీ 2 ఫుల్ మీల్స్ లాంటి సినిమా. రాజ్ కుమార్ రావు అత్యంత ప్రభావవంతమైన నటుడు అనడానికి స్త్రీ 2లో అతడి నటన మరో ఉదాహరణ. అతడు ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. రాజ్ నటన, ఆహార్యం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతాయి. ఇక శ్రద్ధా కపూర్ పరిమితమైనదే అయినా కానీ ప్రభావవంతమైన పాత్రలో మెరిసింది. అందంగా కనిపించే శ్రద్ధా దెయ్యంగాను భయపెడుతుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. శ్రద్ధా కథను నడిపించే పాత్రలో మెప్పించింది. పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అలాగే తమన్నా ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రను పోషించింది. ఆజ్ కీ రాత్ ఐటెమ్ సాంగ్‌లో గ్లామరస్ పెర్ఫామెన్స్ తో మైమరిపించింది.
స్త్రీ 2లో నటీనటుల మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. శ్రద్ధా-రాజ్ కుమార్ రావు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటైంది. హారర్, కామెడీ, రొమాన్స్, వినోదం ఇలా అన్ని అంశాల మేలుకలయికగా స్త్రీ 2 అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రథమార్థం కొంత నెమ్మదిగా సాగినా కానీ, విక్కీ- సర్కత మధ్య సన్నివేశాలతో హీట్ పెరుగుతుంది. ద్వితీయార్థం జోరుగా ముందుకు సాగుతుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే, వీఎఫ్ ఎక్స్ సహా ప్రతిదీ ఆకట్టుకున్నాయి. స్ట్రీ 2 నాన్‌స్టాప్ ఎంటర్ టైనర్. కడుపుబ్బా నవ్వుకునేందుకు ఆస్కారం ఉన్న సినిమా. సంగీతం ఆకట్టుకుంది. నటీనటుల ప్రదర్శనతో పాటు ఇందులో అతిథి పాత్రలు కూడా అద్భుతంగా మెప్పించాయి. చాలా కాలం తర్వాత విమర్శలకు తావు లేని విధంగా ఒక బాలీవుడ్ సినిమా వచ్చిందని కూడా పబ్లిక్ లో టాక్ వినిపిస్తోంది.