తెలుగు కంటే ముందు హిందీలో... సూర్య క్లారిటీ
టాలీవుడ్‌లో తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ సూర్య గతంలో పలు సార్లు ప్రకటించాడు.
తమిళ స్టార్ హీరో సూర్యకి టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గజిని సినిమా కంటే ముందు నుంచే సూర్య అంటే అభిమానించే వారు చాలా మంది ఉన్నారు. గజిని తర్వాత టాలీవుడ్ లో ఆయనకు తెలుగు హీరో స్థాయి ఇమేజ్ దక్కింది. అందుకే ఆయన నటించిన ప్రతి తమిళ సినిమా తెలుగు లో భారీ ఎత్తున విడుదల అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఫలితంతో సంబంధం లేకుండా ప్రతి సినిమాను తెలుగు లో భారీగా విడుదల చేస్తున్నారు అంటేనే ఆయన సినిమాలకు ఇక్కడ ఏ స్థాయి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్‌లో తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తానంటూ సూర్య గతంలో పలు సార్లు ప్రకటించాడు.
సూర్య కంగువా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ బాహుబలి అంటూ ప్రచారం జరుగుతున్న కంగువా సినిమా ప్రమోషన్స్ కోసం ఇటీవల హైదరాబాద్ కి వచ్చిన సూర్య మరోసారి తెలుగు సినిమా గురించి స్పందించాడు. తప్పకుండా తెలుగు లో ఒక డైరెక్ట్ సినిమా చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. సూర్య ఆ సినిమా ఎప్పుడు చేస్తాడు అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే సూర్య డైరెక్ట్ హిందీ సినిమా కన్ఫర్మ్ అయింది. ఆ విషయాన్ని స్వయంగా సూర్య ఒక హిందీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించాడు.
సూర్య మాట్లాడుతూ.. హిందీలో ఒక సినిమా చేయాల్సి ఉంది. సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను పట్టాలెక్కిస్తాం. అయితే సినిమా గురించి నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుంది. ఆ సినిమా ఏంటి, ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయాలను త్వరలోనే నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటిస్తుందని పేర్కొన్నాడు. రాకేష్ ఓం ప్రకాష్ దర్శకత్వంలో తన హిందీ సినిమా ఉంటుందని సూర్య పేర్కొన్నాడు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తూ ఉంటే హిందీలో సినిమాను కమిట్ అవ్వడం ఏంటో అంటూ కొందరు తెలుగు నెటిజన్స్ సూర్య తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
కంగువా సినిమా విషయానికి వస్తే శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూర్యకు జోడీగా బాలీవుడ్ స్టార్ నటి దిశా పటానీ నటించింది. ఇంకా ఈ సినిమాలో బాబీ డియోల్ కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ, దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కంగువా సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుంది అంటూ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఛాలెంజ్ చేయడం జరిగింది. అందుకు సాక్ష్యంగా తాను జీఎస్టీ బిల్లులు సైతం చూపిస్తాను అన్నాడు. ఆయన నమ్మకం చూస్తూ ఉంటే కంగువా సినిమా తమిళనాట మొదటి వెయ్యి కోట్ల సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.