'శ్వాగ్' మూవీ రివ్యూ

క్రేజీ టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన 'శ్వాగ్' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

Update: 2024-10-04 09:40 GMT

'శ్వాగ్' మూవీ రివ్యూ

నటీనటులు: శ్రీ విష్ణు-రీతూ వర్మ-మీరా జాస్మిన్-దక్ష నగార్కర్-వడివుక్కరసి-గోపరాజు రమణ-సునీల్-రవిబాబు-గెటప్ శీను-పృథ్వీ-శరణ్య ప్రదీప్ తదితరులు

సంగీతం: వివేక్ సాగర్

ఛాయాగ్రహణం: వేదరామన్ శంకరన్

నిర్మాత: టి.జి.విశ్వప్రసాద్

రచన-దర్శకత్వం: హాసిత్ గోలి

వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు శ్రీ విష్ణు. అతడి నుంచి వచ్చిన కొత్త చిత్రం.. శ్వాగ్. ఇంతకుముందు శ్రీ విష్ణుతో 'రాజ రాజ చోర' లాంటి సక్సెస్ ఫుల్ మూవీని అందించిన హాసిత్ గోలి ఈ చిత్రాన్ని రూపొందించడంతో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. క్రేజీ టీజర్.. ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన 'శ్వాగ్' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఘన చరిత్ర ఉన్న శ్వాగణిక వంశానికి చెందిన భారీ నిధిని వారి వారసులకు అందించాలని మరో వంశానికి చెందిన ప్రతినిధులు ఎదురు చూస్తుంటారు. కానీ శ్వాగణిక వంశ వారసులెవరన్నదే అంతుబట్టకుండా ఉంటుంది. ఈ స్థితిలో ఎస్ఐగా పని చేసే భవబూతి (శ్రీ విష్ణు).. అనుభూతి (రీతూ వర్మ) వేర్వేరుగా తామే శ్వాగణిక వంశ వారసులమని వస్తారు. తర్వాత వీరికి సింగ (శ్రీ విష్ణు) కూడా తోడవుతాడు. వారిలో ఎవరు నిజమైన వారసులనే విషయం తేల్చడానికి కొన్ని పరీక్షలు చేస్తారు. ఈ క్రమంలో అనేక మలుపులు చోటు చేసుకుంటాయి. ఆ మలుపులేంటి.. ఇంతకీ శ్వాగణిక వంశ చరిత్ర ఏంటి.. ఇంతకీ ఈ వంశానికి నిజమైన వారసులెవరు.. ఈ నిధి ఎవరికి దక్కింది.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

శ్వాగ్.. ఈ పేరుతో ఓ సినిమా తెరకెక్కడమే చిత్రం. దానికి 'శ్వాగణిక వంశానికి స్వాగతం' అంటూ పెట్టిన క్యాప్షన్ ఇంకా చిత్రంగా అనిపించింది. శ్వాగ్ అంటూ ట్రెండీగా అనిపించే టైటిల్ పెట్టి.. రాజులు రాజ్యాలు వంశాలు అంటూ పాత విషయాలతో కథ నడిపించడమేంటా అనే ఆశ్చర్యం ప్రేక్షకుల్లో కలిగింది. కథేంటో అర్థం కాకపోయినా క్రేజీగా అనిపించిన టీజర్.. ట్రైలర్ 'శ్వాగ్' వ్యవహారమేంటో చూడాలన్న కుతూహలం ఏర్పడింది. హాసిత్ గోలి ప్రేక్షకులు ఊహించలేని మలుపులున్న ఒక క్రేజీ కథతో విన్యాసం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఐడియా ఎంత క్రేజీగా ఉన్నా.. దాన్ని అర్థమయ్యేలా.. ఆసక్తి రేకెత్తించేలా నరేట్ చేయడంలోనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది. ఐతే ప్రేక్షకులకు కొత్తగా ఏదో ఇవ్వాలనే హాసిత్ ప్రయత్నం మెచ్చదగిందే అయినా.. ప్రేక్షకకుల ఆసక్తిని నిలిపి ఉంచలేని కథనం.. సన్నివేశాల్లో గందరగోళం వల్ల 'శ్వాగ్' అంచనాలను అందుకోలేకపోయింది. అలా అని ఇది తీసిపడేయద్ద సినిమా అయితే కాదు. రొటీన్ కు భిన్నమైన సినిమా చూడాలనుకునేవారిని ఇది ఎంగేజ్ చేస్తుంది.

'శ్వాగ్‌' ప్రోమోలు చూస్తే ఇది ఆడ-మగ తేడాల గురించి చర్చిస్తూ.. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో నడిచే కథలా అనిపిస్తుంది. దాని మీద కొంత కథ నడిచినా.. అంతకుమించిన విషయం ఇందులో ఒకటి ఉంది. ఆడ.. మగ కాని వ్యక్తులు కుటుంబం నుంచి సమాజం వరకు ఎదుర్కొనే ఇబ్బందులు.. వివక్ష గురించి ఇందులో చాలా హృద్యంగా చెప్పే ప్రయత్నం చేశాడు హాసిత్ గోలి. సమాజంలో ఆడవాళ్ల కంటే వీళ్లు ఎదుర్కొనే వివక్ష పెద్దదని.. ఇది ఇంటి నుంచే మొదలవుతుందని.. ఏ రకమైన లింగ వివక్షా సమర్థనీయం కాదని చెప్పడం ఈ కథ ఉద్దేశం. ఐతే మన మెదళ్లలో ఏళ్ల నుంచి నాటుకుపోయిన అభిప్రాయాల కారణంగా ఇలాంటి విషయాలు తెర మీద చర్చిస్తే కొంత ఇబ్బందిగా అనిపించడం సహజం. 'శ్వాగ్'ను ఒక క్రేజీ ఎంటర్టైనర్ గా భావించి థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు ఈ అంశం షాక్ ఇస్తుంది. హాసిత్ గోలి ఒక నిబద్ధతతో ఈ టాపిక్ ను డీల్ చేశాడని అర్థమవుతుంది. కానీ వినోదాన్ని ఆశించే ప్రేక్షకులకు మెలో డ్రమటిక్ మూవీని చూపించడం రుచించకపోవచ్చు. కానీ కాస్త మనసు పెట్టి చూస్తే ఆ అంశం హృద్యంగా అనిపిస్తుంది. ఈ అంశాన్ని ప్రేక్షకులందరూ ఒకేలా తీసుకోకపోవచ్చు. అదే సమస్య.

400 ఏళ్ల కిందటి నేపథ్యంతో మొదలుపెట్టి ఇప్పటి కాలం వరకు వివిధ దశల్లో 'శ్వాగ్' కథను నడిపించాడు దర్శకుడు. శ్వాగణిక అనే వంశానికి చెందిన భారీ నిధిని ఎవరు చేసుకుంటారనే నేపథ్యంలో ఈ కథను మొదలుపెట్టిన తీరు ఆసక్తి రేకెత్తిస్తుంది. భవభూతి.. అనుభూతి.. సింగ.. ఈ ముగ్గురి పాత్రలకు సంబంధించిన బ్యాక్ స్టోరీలతో ప్రథమార్ధం సాగుతుంది. ఇందులో భవభూతి కథ ఆసక్తి రేకెత్తిస్తుంది. తన భార్యగా చేసిన మీరా జాస్మిన్ నటన.. తన పాత్ర సినిమాకు పెద్ద బలం. ఆ ఎపిసోడ్ వరకు ఆసక్తికరంగా డీల్ చేసిన హాసిత్.. అనుభూతి.. సింగ్ పాత్రల విషయంలో మాత్రం నిరాశపరిచాడు. నరేషన్లో కన్ఫ్యూజన్ ప్రేక్షకులకు కొంత చికాకు పెడుతుంది. ఐతే పడుతూ లేస్తూ సాగే 'శ్వాగ్' ప్రథమార్ధం విరామ సమయానికి మంచి మలుపు తీసుకుంటుంది. ఆడ వేషంలో శ్రీవిష్ణు పాత్ర ప్రవేశంతో సినిమా ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ క్రేజీగా అనిపిస్తుంది. ఇక ద్వితీయార్దంలో ఒకప్పుడున్న మాతృస్వామ్య వ్యవస్థ గిట్టని ఓ రాజు.. దాన్ని మార్చి పితృస్వామ్య వ్యవస్థను ఎలా నెలకొల్పాడు అన్నది కొంచెం క్రేజీగా చూపించాడు హాసిత్ ఇందులో. ఐతే రాజుల కాలం నాటి ఆ ఎపిసోడ్ ఫన్నీగా అనిపిస్తుంది తప్ప కథకు అవసరమైన బలాన్ని తీసుకురాలేకపోయింది. ఇక శ్రీ విష్ణునే పోషించిన హిజ్రా పాత్ర మీదే ద్వితీయార్ధంలో చాలా వరకు కథ నడుస్తుంది. అది పూర్తిగా ఎమోషనల్ టచ్ తో సాగడం వల్ల ద్వితీయార్ధం ప్రేక్షకులకు భారంగా అనిపిస్తుంది. రాను రాను కథలో వేగం మరీ నెమ్మదించడంతో ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. కానీ తర్వాత ఏం జరుగుతుంది.. ఈ కథ ఎలా ముగుస్తుంది అనే ఆసక్తి ప్రేక్షకులను చివరి వరకు కూర్చునేలా చేస్తుంది. పతాక సన్నివేశాలు బాగున్నాయి. అక్కడ మంచి డైలాగులు పడ్డాయి. చివరగా ఇచ్చిన సందేశం గొప్పగా అనిపిస్తుంది. ఈ కథను ఇంకా వినోదాత్మకంగా.. గందరగోళం తగ్గించి చెప్పాల్సిందనిపిస్తుంది. భిన్న పాత్రల్లో శ్రీ విష్ణు పెర్ఫామెన్స్ అదిరిపోయినా.. కథ కొత్తగా అనిపించినా.. ఇచ్చిన సందేశం బాగున్నా.. ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది 'శ్వాగ్'లో.

నటీనటులు:

శ్రీ విష్ణుకు ఇది కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. ఐదు భిన్నమైన పాత్రలు.. వాటిలో మరెన్నో వేషాలతో అతను ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తాడు. ఏ పాత్రకు ఆ పాత్ర వేరుగా అనిపించేలా అతను పెర్ఫామ్ చేసిన తీరు అసామాన్యం. ముఖ్యంగా హిజ్రా పాత్రలో విష్ణు అప్పీయరెన్స్.. తన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి పాత్రను ఇంత కన్విన్సింగ్ గా చేయడం చిన్న విషయం కాదు. మిగతా పాత్రల్లోనూ తను రాణించాడు. ఆయా పాత్రలకు తగ్గట్లుగా మేకప్.. హావభావాల విషయంలో అతనెంత కష్టపడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి భిన్నమైన కథకు ఓకే చెప్పడం కూడా అభినందనీయం. మీరా జాస్మిన్ రెండో ఇన్నింగ్స్ లో బెస్ట్ రోల్ చేసింది. ఆమె చూడ్డానికి చక్కగా అనిపించడమే కాక.. చక్కగా నటించి మెప్పించింది. రీతూ వర్మ పాత్ర అనుకున్నంత స్థాయిలో లేదు. మహారాణిగా కాసేపు ఓకే అనిపించినా.. అక్కడ తన పరిధి తగ్గిపోయింది. మోడర్న్ అమ్మాయిగా తన పాత్ర.. నటనలో ఏమంత్ర ప్రత్యేకత కనిపించదు. దక్ష నగార్కర్ క్యారెక్టర్ నామమాత్రం. వడి వుక్కరసి.. గోపరాజు రమణ సహాయ పాత్రల్లో ఆకట్టుకున్నారు. సునీల్ జస్ట్ ఓకే అనిపించాడు. రవిబాబు.. గెటప్ శీను బాగానే చేశారు. మిగతా నటీనటులు మామూలే.

సాంకేతిక వర్గం:

నవతరం దర్శకులు రూపొందించే ఇలాంటి వైవిధ్యమైన చిత్రాలకు వివేక్ సాగర్ ఆస్థాన సంగీత దర్శకుడు అయిపోయాడు. అతను ఎప్పట్లాగే నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. ఆద్యంతం మంచి జోష్ తో నడుస్తుంది సంగీతం. ఐతే పాటలు ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. శ్రీ విష్ణు-మీరా జాస్మిన్ మధ్య వచ్చే మెలోడీ కొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. మిగతా పాటలు సాధారణం. వేదరామన్ శంకరన్ ఛాయాగ్రహణం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు పెద్ద ప్లస్. ఇలాంటి కథను నమ్మి రాజీ లేకుండా నిర్మించడం అభినందనీయం. హీరో-దర్శకుడు కాంబినేషన్ చూసి ఇది చిన్న సినిమా అనుకుంటాం కానీ.. ఆ ఫీలింగ్ రాకుండా రిచ్ గా తీశారు. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ హాసిత్ గోలి స్క్రిప్టు విషయంలో ఎంతో కసరత్తు చేసిన విషయం అర్థమవుతుంది. ప్రేక్షకుల అంచనాలకు అందని విధంగా కథను నడిపించాలనే అతడి తపన ప్రశంసనీయం. కానీ ఎంత కొత్తగా ప్రయత్నించినా.. అది కన్విన్సింగ్ గా ఉండడం కీలకం. 'శ్వాగ్' ఆ విషయంలోనే తడబడింది. విడివిడిగా కొన్ని ఎపిసోడ్ల వరకు ఓకే అనిపించినా.. ఓవరాల్ గా 'శ్వాగ్'తో హాసిత్ అంచనాలను అందుకోలేకపోయాడు.

చివరగా: శ్వాగ్.. క్రేజీ కథలో సోసో కథనం

రేటింగ్-2.5/5

Tags:    

Similar News