కుంచించుకుపోయిన ఆలోచనల నుంచి తంబీలు బయటికి రావాలి!
ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా
తమిళుడు అయిన సముద్రకనికి తెలుగు సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అతడు తెరకెక్కించిన బ్రో ఈనెల 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమకు ఓ చిన్న విన్నపం. తమిళ సినిమాల్లో తమిళులు మాత్రమే పనిచేయాలనే ఆలోచన నుంచి తమిళ చిత్ర పరిశ్రమ బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బ్రో వేదికపై పవన్ ఉద్విగ్నభరితమైన ప్రసంగం తమిళతంబీలకు నిజమైన జోల్ట్ అని చెప్పాలి. ఆయన మాట్లాడుతూ-'''నేడు తెలుగు సినిమా పరిశ్రమ చాలా మందికి జీవనోపాధిని కల్పిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆదరిస్తోంది. అవకాశాలు కల్పిస్తోంది. అదేవిధంగా తమిళ చిత్ర పరిశ్రమ అందరినీ ఆహ్వానించాలి. కేవలం తమిళులకే పరిమితమైతే పరిశ్రమ ఎదగదు. తెలుగు పరిశ్రమ నేడు ఎదుగుతోంది అంటే మనం ఇతర పరిశ్రమల నుండి ప్రతిభను ప్రోత్సహిస్తున్నాము గనుకే'' అని అన్నారు.
''మలయాళం నుంచి సుజిత్ వాసుదేవ్ ని తీసుకున్నాం. మేము ఉత్తరాది నుండి ఊర్వశి రౌతేలాను తీసుకుంటాము. విభజన సమయంలో పాకిస్తాన్ నుండి భారతదేశానికి వలస వచ్చిన నీతా లుల్లాను మేము తీసుకుంటాము. ఈ సాంకేతిక నిపుణులందరూ బ్రో చిత్రానికి పనిచేశారు. ఇతర భాషల ప్రతిభ కలగలిసి ఉంటేనే సినిమా తీయవచ్చు. అది మన భాషకు, మన వ్యక్తులకే పరిమితమైతే పరిశ్రమ కుంచించుకుపోతుంది. ఈ ఆలోచన నుంచి బయటపడి ఆర్.ఆర్.ఆర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన సినిమాలు తీయాలని తమిళ పరిశ్రమలోని పెద్దలను కోరుతున్నాను'' అని పవన్ కల్యాణ్ కోరారు.
ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) ఇటీవల తమిళ పరిశ్రమకు కొత్త మార్గదర్శకాలను నిర్దేశించిన నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియమాలలో కేవలం తమిళ చిత్రాలకు తమిళ నటులను మాత్రమే పని చేయాలని .. పూర్తిగా అవసరమైతే తప్ప తమిళనాడులో మాత్రమే తమిళ చిత్రాలను చిత్రీకరించాలని కొన్ని విధానాలను ఫ్యాఫ్సీ నిర్ధేశించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని సదరు సంస్థ పేర్కొంది. అయితే దీనికి విరుద్ధంగా తమిళ తంబీల కుంచించుకుపోయిన క్యారెక్టర్ ని తప్పు పడుతూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కనీసం ఇకనైనా తంబీలు మారాలని ఆయన సూచించారు.