2000 కోట్ల డ్రగ్స్ లో నిర్మాత.. డైరెక్టర్‌కి తలనొప్పులు!
తమిళ సినీ నిర్మాత ఏఆర్ జాఫర్ సాదిక్ కు రూ. 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్‌లో ప్రమేయం ఉన్నట్లు ఇంతకుముందే ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల వరుస డ్రగ్స్ రాకెట్లు సంచలనంగా మారుతున్నాయి. తమిళ సినీ నిర్మాత ఏఆర్ జాఫర్ సాదిక్ కు రూ. 2000 కోట్ల డ్రగ్స్ రాకెట్‌లో ప్రమేయం ఉన్నట్లు ఇంతకుముందే ఆరోపణలు వచ్చాయి. దీనిని ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) గుర్తించింది. రాకెట్‌లో పేరు బయటపడ్డ జాఫర్ ప్రస్తుతం తమిళంలో సినిమాలు నిర్మిస్తున్నారు. అమీర్ సుల్తాన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'ఇరైవన్ మిగా పెరియవన్'కి ఆయన నిర్మాత కూడా. అంతేకాదు.. రెస్టారెంట్ వ్యాపారంలో అమీర్ కి జాఫర్ సాధిక్ భాగస్వామి కూడా. దీంతో అమీర్ ఖంగు తిన్నారు.
ఇటీవలి సంఘటనలను ప్రస్తావిస్తూ.. అమీర్ ఇప్పుడు తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశాడు. డ్రగ్ రాకెట్‌లో జాఫర్ ప్రమేయం గురించి తనకు తెలియదని అమీర్ తెలియజేశాడు. అమీర్ తన స్వీయ వివరణాత్మక ప్రకటనలో తాను ఇంకా షాక్ లో ఉన్నానని అన్నారు. ''గత రెండు రోజులుగా, నా సినిమా నిర్మాత ఇరైవన్ మిగ పెరియవన్ గురించి వస్తున్న వార్తలు నన్ను షాక్‌కు గురి చేశాయి, 22 న ఇరైవన్ చివరి షెడ్యూల్ సాగుతోంది. కానీ ఇంతలోనే ఈ వార్తలతో షూటింగ్ హఠాత్తుగా ఆగిపోయింది.. షూటింగ్ ఎందుకు ఆగిపోయింది.. అంటే! నా చుట్టూ ఏం జరుగుతోందో మీడియాలో వచ్చిన వార్తల ద్వారానే తెలుసుకున్నాను కానీ.. నేటికీ నిజం తెలియదు.. అయితే ఈ ఆరోపణలు నిజమే అయితే ఆ వ్యక్తిని ఖండించాలి.. శిక్షించాలి'' అని అన్నాడు.
అమీర్ ఇంకా మాట్లాడుతూ ''ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం నటీనటులు నిర్మాతలతో రాజీ పడడాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని.. మీడియాకు నా గురించి బాగా తెలుసు'' అని అన్నారు. ఇలాంటి తప్పుడు కారణాలు ఉన్న వారితో నేను పని చేయనని చెప్పాలనుకుంటున్నాను. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారితో పని చేయను.. ఇప్పుడు కూడా నేను తరచుగా జర్నలిస్టులతో మాట్లాడే మా కార్యాలయంలో నా సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత నేను త్వరలో మీడియా వ్యక్తులను కలుస్తాను'' అని అన్నారు.
సూర్య నటించిన మౌనం పేసియాదే (2002)లో అరంగేట్రం చేసిన అమీర్ విమర్శకుల ప్రశంసలు పొందిన రామ్ (2005), పరుత్తివీరన్ (2007), ఆది భగవాన్ (2013) చిత్రాలను రూపొందించారు. అతడు వెట్రి మారన్ వడ చెన్నై (2018)లో కూడా కీలక పాత్రలో కనిపించాడు. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడైన అమీర్ 'వాడివాసల్'లో నటించాడు. ఇందులో సూర్య నటిస్తున్నాడు.