మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంతా..!
బ్రహ్మానందం మాట్లాడుతూ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడింది చూస్తే కామెడీ, హాస్యాన్ని ఇంత కష్టపడి చూపించాలా అని అర్థమైంది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన కీడా కోలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చిన ఈ వేడుకకి హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. సినిమాలో బ్రహ్మి ఒక మంచి పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఇక ఈవెంట్ లో భాగంగా బ్రహ్మానందం తన స్పీచ్ తో కూడా ప్రేక్షకులను అలరించారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడింది చూస్తే కామెడీ, హాస్యాన్ని ఇంత కష్టపడి చూపించాలా అని అర్థమైంది. ప్రేక్షకులు నవ్వడానికి లాజికల్ రీజన్స్ తన సినిమాలతో చెబుతున్నాడని అన్నారు. ఈ సినిమాలో నటించడానికి కారణం తరుణ్ భాస్కర్. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలు చూసి ఇలాంటి కుర్రాళ్ల దగ్గర పనిచేస్తే బాగుంటుందని అనిపించింది. కానీ ఈలోగ అడ్డొస్తుంది. మన వెళ్లి అవకాశం అడగలేం.. వాళ్లు వచ్చి అడుగుతారా అంటే బ్రహ్మానందం అంటే పెద్దోడు మన సినిమాలో ఏం చేస్తాడులే అని దూరంగా ఉంటారని అన్నారు.
తరుణ్ వచ్చి మా సినిమాలో నటించాలని అడగ్గానే సంతోషంగా ఒప్పుకున్నాను. చాలా సినిమాలు చేశా కానీ ఈ సినిమా యూనిట్ ట్రీట్ చేసిన విధానం చాలా ఆనందంగా అనిపించింది. నన్ను ఒక ఫాదర్లీ ఫిగర్ లా చాలా జాగ్రత్తగా పువ్వులా చూసుకున్నారు. మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు చెప్పారు బ్రహ్మానందం. ఈ టీం తో కలిసి చేస్తుంటే తాను కూడా యంగ్ గా ఫీల్ అయ్యా.. అందుకే ఇలాంటి వారితో సినిమాలు చేస్తా అన్నారు బ్రహ్మి.
ఇక సినిమాలో తనని వీల్ చెయిర్ లో కూర్చోబెట్టి కామెడీ చేయించాడు తరుణ్ భాస్కర్. మరి ఆలోచన ఎందుకు వచ్చిందో ఏంటో.. వీల్ చెయిర్.. యూరిన్ ప్యాకెట్ ఇలా నావెల్ థాట్ తో కామెడీ క్రియేట్ చేయడం కొద్దిమంది దర్శకుల్లో ఉంటుంది వారిలో తరుణ్ భాస్కర్ ఒకరని అన్నారు. ఒక సినిమా చేసేప్పుడు భయంతో మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలని తపన వీళ్లలో చూశాను.
ఒక సినిమాలో ఫైట్స్, డ్యాన్స్ బాగుంటే అది తర్వాత చర్చిస్తాం కానీ కామెడీ రిజల్ట్ అక్కడే తెలుస్తుంది. బాగా చేస్తే అక్కడే నవ్వుతారు. తను జంధ్యాల సినిమా చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అలానే ఫీల్ అయ్యానని అన్నారు. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా హాస్యాన్ని పండించడం చాలా గొప్ప విషయమని అన్నారు
చివరగా ఒక కమెడియన్ ఆడియన్స్ ని నవ్వించడానికి ఎంతో కష్టపడతాడని. మిమ్మల్ని నవ్వించడానికే మా ఏడుపంతా.. కమెడియన్ నవ్వించడానికి అతను లోపల మదన పడేది తూకం వేస్తే ఇవతల ఎన్ని రాళ్లు పెట్టినా సరిపోదు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, అచార్య దేవోభవ, హాస్యనట దేవోభవన అని తన స్పీచ్ ముగించారు బ్రహ్మానందం.