ఆర్జీవి వ్యూహం కు హైకోర్టు షాక్..!
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈమధ్య తన సినిమా ప్యాషన్ ని రాజకీయ నేపథ్యం మీద పెట్టాడు
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈమధ్య తన సినిమా ప్యాషన్ ని రాజకీయ నేపథ్యం మీద పెట్టాడు. ఈ క్రమంలో ఆయన వ్యూహం, శపథం అనే రెండు సినిమాలు ప్లాన్ చేశారు. ఆల్రెడీ వ్యూహం ట్రైలర్ రిలీజ్ తో హడావిడి చేసి సినిమా కూడా రిలీజ్ చేయాలని చూశారు. కానీ సినిమా రిలీజ్ ని అడ్డుకుంటూ టీడీపీ నాయకులు తెలంగాణ హైకోర్టులో కేసు వేశారు. అలా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా జనవరి 11 కల్లా ఈ ఇష్యూస్ క్లియర్ చేసుకుని రిలీజ్ చేయాలని అనుకున్నారు.
ఆ టైం కు కూడా కోర్టు నుంచి రిలీజ్ కు అనుకూల తీర్పు రాలేదు. అయితే వర్మ మాత్రం సినిమా రిలీజ్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులో సినిమా రిలీజ్ కోసం పోరాడుతున్నారు. లేటెస్ట్ గా మరోసారి వ్యూహం సినిమా పై కోర్టులో విచారణ జరగగా మరోసారి గట్టి దెబ్బే తగిలినట్టు తెలుస్తుంది.
ఇదివరకు సింగిల్ బెంచ్ తీర్పు ఇస్తూ సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ని రద్దు చేసింది. నాలుగు వారాల్లో మళ్లీ సెన్సార్ బోర్డ్ రివ్యూ చేసి కొత్త రిపోర్ట్ ని ఇవ్వాలని కోరింది. అయితే ఆర్జీవి అండ్ టీం ఆ తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ ని పరిశీలించిన న్యాయమూర్తి కూడా సింగిల్ బెంచ్ తీర్పుని ఫాలో చేస్తూ సెన్సార్ బోర్డు ఈ నెల తొమ్మిది లోగా రిపోర్ట్ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.
సినిమాపై క్లియరెన్స్ వస్తే రిలీజ్ చేయాలని చూస్తున్న ఆర్జీవికి దెబ్బ మీద దెబ్బ పడినట్టు అయ్యింది. ఈ మూవీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీగా తెరకెక్కించారు ఆర్జీవి. సినిమా టీడీపీని టార్గెట్ చేస్తూ తీసిందని టీడీపీ నాయకులు సినిమాను రిలీజ్ అవ్వకుండా చూస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ విషయంలో ఆర్జీవి నెక్స్ట్ స్టెప్ ఏంటి. వ్యూహం సినిమాను థియేట్రికల్ రిలీజ్ వదిలి డైరెక్ట్ ఓటీటీ వదులుతారా.. వ్యూహం రిలీజ్ పై ఆర్జీవి వ్యూహం ఏంటన్నది తెలియాల్సి ఉంది.