డైరెక్టర్స్ డే ఈవెంట్‌లో షోస్టాపర్
డైరెక్టర్స్ డే ఈవెంట్ ఈ ఆదివారం సాయంత్రం గచ్చిబౌళి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది
డైరెక్టర్స్ డే ఈవెంట్ ఈ ఆదివారం సాయంత్రం గచ్చిబౌళి స్టేడియంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈవెంట్లో ముఖ్య అతిథి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ యూనిక్ స్టైల్ తో కనిపించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు అర్జున్, నాని సహా పలువురు స్టార్లు పాల్గొన్న ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెసైంది. వేదికపై అల్లు అర్జున్ తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతిని ఘడించడంలో దర్శకుల కృషిని కొనియాడారు.
తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మెల్లగా గుర్తింపు పొందుతున్నాయని.. ఈ ఎదుగుదల విషయంలో తాను చాలా ఉప్పొంగిపోతున్నానని ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నాడు. నెమ్మదిగా కానీ కచ్ఛితంగా తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా పుంజుకుంటున్నాయని అన్నారు. ఈ స్థాయికి చేర్చిన తెలుగు దర్శకులను అల్లు అర్జున్ ప్రశంసించారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు దర్శకులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇది అన్ని చోట్లా ప్రశంసలు పొందుతోంది! అని బన్ని అన్నారు.
లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి ఉత్సవాలను డైరెక్టర్స్ డే గా సెలబ్రేట్ చేయడం చాలా ప్రత్యేకమైనది.. ప్రశంసనీయమైనది. మా బ్యానర్ గీతా ఆర్ట్స్ ని ప్రారంభించిన దర్శకదిగ్గజం దాసరి నారాయణరావుగారితో నాకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. గొప్ప దర్శకుడైన దాసరి గారితో నాకు వ్యక్తిగత అనుబంధం ఉంది అని అన్నారు.
తెలుగు దర్శకుల సంఘం సభ్యులు ఈ వేడుకను ఘనంగా నిర్వహించారని బన్ని వేదికపై కొనియాడారు. ఇతరత్రా ధన ప్రయోజనాలు ఆశించకుండా డైరెక్టర్లు కష్టపడి ఈ ఈవెంట్‌ను అద్భుతంగా నిర్వహించారు. వాస్తవానికి దర్శకులు తమ సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు.. కానీ వారు ఈ వేడుకల కోసం కొంత సమయం కేటాయించడం ప్రశంసనీయమని కీర్తించారు. అడివి శేష్, సుధీర్ బాబు, అల్లరి నరేష్ తదితరులు వేడుకలో పాల్గొన్నారు.