పరిష్కార కమిటీ భరోసాతో ముందుకొచ్చేది ఎంత మంది?
మొత్తానికి టాలీవుడ్ లో కూడా జస్టిస్ హేమ కమిటీ నివేదికతో కదలిక మొదలైంది.
మొత్తానికి టాలీవుడ్ లో కూడా జస్టిస్ హేమ కమిటీ నివేదికతో కదలిక మొదలైంది. డాన్స్ మాస్టర్ జానీ భాషా పై లైంగిక ఆరోపణలు తెరపైకి రావడంతో అతడిపై ఇండస్ట్రీ వైపు నుంచి ఇప్పటికే వేటు పడింది. చిత్ర పరిశ్రమ బాధిత మహిళకు అండగా నిలబడింది. దీంతో జానీ మాస్టర్ అరెస్ట్ కి రంగం సిద్దమైంది. పరారీలో ఉన్న జానీని ఏ క్షణమైనా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నింటిని తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇక చిత్ర పరిశ్రమ నుంచి పరిష్కార కమిటీ కూడా బాధిత మహిళలకు అండగా ఉంటామని భరోసా కల్పించింది. పరిశ్రమలో అవకాశాలు రావు అనే భయాన్ని పక్కనబెట్టి లైంగికంగా బాధింపబడ్బ వారంతా ధైర్యంగా ముందుకొచ్చి తమ గోడు వినిపించుకోవాలని...అందులో నిజం ఉంటే ఎలాంటి వారికైనా చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని భరోసాని ఇచ్చింది.
అలాగే ఇండస్ట్రీలో ఉన్న 24 శాఖల్లోనూ వాటి ఫరిదిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకుని బాధిత మహిళలంతా వారికి ఫిర్యాదు చేయోచ్చని..లేదంటే నేరుగా తమ పరిష్కార కమిటీ ఫ్యానెల్ ని సంప్రదిం చొచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో మరింత బాధిత మహిళలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్స్ లో చర్చ సాగుతుంది. గతంలో మీటూ ఉద్యమం సమయంలో కొంత మంది నటీమణులు మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
కొన్ని బడా నిర్మాణ సంస్థల్లో వివిధ సెక్షన్లలో పనిచేసే వారు జూనియర్ ఆర్టిస్టులను, నటీమణులను లైంగికంగా వేధించారంటూ ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కున్న వారు సైతం మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇలాంటి ఆరోపణలు పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి. ఆ సమయంలో ఇండస్ట్రీలో అప్పటి ప్రభుత్వం పరిశ్రమ వ్యక్తులతో కలిసి కమిటీ కూడా నియమించింది.
ఆ కమిటీ నివేదికనే సమంత రిలీజ్ చేయాలని తాజాగా డిమాండ్ చేసింది. సీన్ లోకి పరిష్కార కమిటీ కూడా వచ్చింది కాబట్టి ఆ బాధిత మహిళలంతా మళ్లీ మీడియా ముందుకొచ్చే అవకాశం కనిపిస్తుందని పలువురు భావిస్తున్నారు. మరి జానీతో మొదలైన వేడి ఎంత మందితో ? ఎన్ని రోజుల్లో ముగుస్తుందో చూడాలి.