నీ మాటలు హృదయాన్ని తాకాయి : చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌ ద్వారా స్పందిస్తూ... నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి.

Update: 2025-01-18 08:01 GMT

బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా సక్సెస్‌ మీట్‌లో సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ ఫ్యాన్‌ వార్‌పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశాడు. నిర్మాతలు చాలా కష్టపడి సినిమాలను నిర్మిస్తున్నారు. వారిని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత. తెలుగు సినిమా వైపు మొత్తం ప్రపంచం చూస్తూ ఉంటే, కొందరు ఫ్యాన్‌ వార్‌ పేరుతో సినిమాలను చంపేస్తున్నారు అంటూ తమన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమన్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కొందరు తమన్‌ వ్యాఖ్యలను విమర్శిస్తే కొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలను సమర్ధిస్తూ ఉన్నారు. తాజాగా చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా తమన్ వ్యాఖ్యలపై స్పందించారు.

మెగాస్టార్ చిరంజీవి సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ ఎక్స్‌ ద్వారా స్పందిస్తూ... నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయినా క్రికెట్ అయినా మరో సామాజిక సమస్య అయినా సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి. ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, Words can inspire. And Words can destroy. Choose what you wish to do. మనం పాజిటివ్ గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్ గా ముందుకు నడిపిస్తుంది అని ట్వీట్‌ చేశారు.

సినిమాపై నెగటివ్‌ ప్రచారం అనేది కేవలం ఆ ఒక్క సినిమాతో ఆగిపోవడం లేదు. ఆ సినిమా నష్టపోవడం అంటే మొత్తం ఇండస్ట్రీ నష్టపోవడం అనే విషయాన్ని కొందరు గుర్తించడం లేదు. అభిమానులు ఒకరిపై మరొకరు విష ప్రయోగం చేయడం, సినిమా విడుదల సమయంలో నెగటివ్‌ టాక్ స్ప్రెడ్‌ చేయడం వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు. ఈమధ్య కాలంలో ఏకంగా హెచ్‌డీ ప్రింట్‌లను లీక్‌ చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల చాలా సినిమాలు నష్టపోతున్నాయి. ఇండస్ట్రీ మనుగడకు ప్రమాదం. తెలుగు సినిమా నుంచి ఒకవైపు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న సినిమా వస్తున్న ఈ సమయంలో ఇలాంటి ఫ్యాన్‌ వార్‌ ఏమాత్రం మంచిది కాదు.

తమన్‌ అదే విషయాన్ని డాకు మహారాజ్ సినిమా సక్సెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు. నిర్మాతలకు దక్కాల్సిన గౌరవం కచ్చితంగా ఇవ్వాల్సిందే. అదే సమయంలో ఫ్యాన్‌ వార్ విషయంలో ఆయన అభిమానుల అభిమాన హీరోలు సైతం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. హీరోల పేరు చెప్పి మరో హీరో సినిమాకు నెగటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ చేయడం అనేది ఈమధ్య కాలంలో ఎక్కువ జరుగుతుంది. సోషల్‌ మీడియాలో కొంత మంది చేస్తున్న ఈ పని వల్ల మొత్తం ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే తమన్‌ వ్యాఖ్యలను చాలా మంది సమర్ధిస్తూ ఉన్నారు.

Tags:    

Similar News