గేమ్ ఛేంజర్ వేదికపై థమన్ తడబాటు..కారణం తెలిస్తే షాక్!
పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్.. సినిమా గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ సమక్షంలో ఈవెంట్ చేస్తున్నాం.
ఈరోజు ఎందుకనో థమన్ తడబడుతున్నాడు. అతడి నోట పదాలు తడబడుతున్నాయి. నాలుక తిరగడం లేదు. చాలా ఇబ్బందిగా కనిపిస్తున్నాడు. చూస్తుంటే అతడు వేదికపై మాట్లాడటం కష్టమేమో అనిపించింది. అయినా థమన్ 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ వేదికపైకి వచ్చాడు. తాను సంగీతం అందించిన పాటల వేడుకలో ఎవరినీ నిరుత్సాహపరచలేదు.
పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్.. సినిమా గేమ్ ఛేంజర్ రామ్ చరణ్ సమక్షంలో ఈవెంట్ చేస్తున్నాం. ఈ ఈవెంట్ కోసం దిల్ రాజు గారు సర్వశక్తులు ఒడ్డారు! అంటూ థమన్ తన స్పీచ్ ని ప్రారంభించి.. ఆ తర్వాత కొన్నిసార్లు గాయనీగాయకులను వేదికపై పిలుస్తూ వారి పేర్లు పలకడంలో ఇబ్బంది పడ్డాడు. నాలుక తడబడింది. ప్రతి అక్షరం విడివిడిగా ఒత్తి పలకాల్సి వచ్చింది. అతడు ప్రేక్షకులకు సారీ కూడా చెప్పాడు. తన తడబాటునకు కారణం కూడా చెప్పాడు. తాను 15 రోజులుగా నిదురపోలేదని థమన్ చెప్పాడు. అంటే గేమ్ ఛేంజర్ డెడ్ లైన్ దగ్గరపడుతున్న కొద్దీ అతడు బెటర్ మెంట్ కోసం ఇంకా ఎంతగా శ్రమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి.
ఏదైనా సినిమా రిలీజయ్యే వరకూ.. రిలీజ్ ముందు పది రోజులూ తాము ఏదో ఒక బెటర్ మెంట్ కోసం ప్రయత్నిస్తూనే ఉంటామని గతంలో థమన్ చెప్పాడు. సినిమా రిలీజ్ ముందు టెన్షన్స్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ల డెడికేషన్ గురించి వెల్లడించాడు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసం థమన్ నిదుర అన్నదే లేకుండా పని చేస్తున్నాడు. అయితే అతడి శ్రమ పాటల్లో, రీరికార్డింగ్ లో కచ్ఛితంగా కనిపిస్తుందనడంలో సందేహం లేదు. ఈరోజు ప్రీరిలీజ్ వేదికపై 'కొండ దేవర గుండె నీదిర..' అనే పాటను లైవ్ లో గాయనీమణులు ఆలపించారు. ఇది ఆల్బమ్ లో చాలా ఉత్కంఠ కలిగించే పాట. ఈవెంట్ కి గోదారి జిల్లాలు సహా తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా జన సందోహం తరలివచ్చారు.
మరోవైపు ఈవెంట్ ముఖ్య అతిథి పవన్ కల్యాణ్ రాక కోసం అభిమానులు ఉత్సాహంగా వేచి చూస్తుండగా, పవన్ గురించి థమన్ మాట్లాడాడు. 'ఓజీ' సినిమాలో గేమ్ ఛేంజర్ పవన్ కల్యాణ్ గారు.. ఇదివరకే నేను చెప్పాను. ఆయన రాకకోసమే వెయిటింగ్ అంటూ కూడా పవన్ అభిమానుల్లో ఉత్సాహం పెంచాడు థమన్. రామ్ చరణ్- కియరా అద్వానీ జంటగా శంకర్ తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా ఈనెల 10న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రాజమండ్రిలో జరుగుతున్న ప్రీరిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు, థమన్ తదితరులు పాల్గొన్నారు.