ప్రభాస్, పవన్, మహేశ్, తారక్, చరణ్ అందరినీ కవర్ చేసిన థమన్!

నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, ఈ సందర్భంగా తన రాబోయే సినిమాలకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్స్ అందించారు.

Update: 2024-08-02 15:45 GMT

మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.థమన్ ప్రస్తుతం కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఓవైపు పాన్ ఇండియా సినిమాలు సంగీతం సమకూరుస్తూనే, మరోవైపు పలు తెలుగు తమిళ హిందీ చిత్రాలకు వర్క్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే థమన్.. తాజాగా ఎక్స్ లో చిట్ చాట్ నిర్వహించారు. నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, ఈ సందర్భంగా తన రాబోయే సినిమాలకు సంబంధించిన మ్యూజికల్ అప్డేట్స్ అందించారు.

థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో 'గేమ్ ఛేంజర్' ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్.శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 'జరగండి' పాట తర్వాత సెకండ్ సింగిల్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఆరాలు తీస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆగస్టు నెల నుంచి అప్డేట్స్ వస్తాయని థమన్ ఇటీవల ఓ కార్యక్రమంలో వెల్లడించారు. తాజా చిట్ చాట్ లో ఇదే విషయాన్ని ఓ నెటిజన్ అడగ్గా.. ఈ నెలాఖరు నుంచి మ్యూజికల్ అప్డేట్స్ వస్తాయని తెలిపారు.

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీకి థమన్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఒక్క పాట కూడా బయటకు రాలేదు. ఆ మధ్య వచ్చిన ఫస్ట్ గ్లిమ్ప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా గురించి ఏమైనా చెప్పమని ఓ అభిమాని అడగ్గా.. ''నేను NBK109 సినిమాకి సంబంధించిన కొన్ని రషెస్ చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం ఫీస్ట్ లా ఉండబోతోంది'' అని తమన్ బదులిచ్చారు. అతి త్వరలో తమిళ హీరో అజిత్ కుమార్ తోనూ వర్క్ చేస్తానని చెప్పారు.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాల్లో OG కూడా ఉంది. సుజీత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ గురించి అడిగితే.. సుజిత్ తో కలిసి ప్రమోషనల్ స్టఫ్ ను రెడీ చేస్తున్నట్లు చెప్పారు. అది అతి త్వరలోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇది అతి పెద్ద సినిమా అవుతుందని పేర్కొన్నారు. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో రూపొందుతున్న 'ది రాజా సాబ్' సినిమాకీ థమనే సంగీతం సమకూరుస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా నుంచి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్ రిలీజైంది. వచ్చే ఏడాది జనవరిలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తామని మ్యూజిక్ డైరెక్టర్ వెల్లడించారు.

మహేశ్ బాబు గురించి చెప్పమని ఓ సూపర్ స్టార్ ఫ్యాన్ అడగ్గా.. టెక్నిషియన్స్ పట్ల ఆయన చూపించే ప్రేమ, కేరింగ్ చాలా గొప్పదని థమన్ అన్నారు. హార్ట్ పేషెంట్ల కోసం ఆయన చేసే సేవా కార్యక్రమాలు తనకు చాలా ఇష్టమని, నిజంగా మహేష్ చాలా కేరింగ్ హ్యూమన్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గురించి ఒక్క మాట చెప్పమని అడిగితే.. ఆయన మోస్ట్ ఎంకరేజింగ్ పర్సన్ అని థమన్ చెప్పుకొచ్చారు. 'వారసుడు' తన హృదయానికి చాలా దగ్గరైన ఆల్బమ్ అని, ఈ మ్యూజిక్ కొన్ని అవార్డులను గెలుచుకోవాలని కోరుకుంటున్నానని తమన్ ఆశాభావం వ్యక్తం చేసారు. అతి త్వరలో OGతో కలుస్తానని ఈ చిట్ చాట్ ను ముగించారు.

మామూలుగా సినీ అభిమానులు సోషల్ మీడియాలో మేకర్స్ ట్యాగ్ చేసి రిక్వెస్టులు చేసినా, నెగెటివ్ హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేసినా అప్డేట్స్ ఇవ్వడం లేదు. అలాంటిది ఇప్పుడు థమన్ తన ఐదు నిమిషాల చిట్ చాట్ లో స్టార్ హీరోలు నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Tags:    

Similar News